Site icon NTV Telugu

Asaduddin Owaisi: ఉగ్రదాడి నేపథ్యంలో ముస్లింలకు ఓవైసీ కీలక పిలుపు..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దేశ ముస్లింలకు కీలక పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామనే సందేశాన్ని పంపడానికి శుక్రవారం ప్రార్థనలకు వెళ్లేటప్పుడు ముస్లింలు తమ్ చేతులకు నల్ల బ్యాండ్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్స్ పోస్టులో ‘‘ మీ అందరికీ తెలిసినట్లుగా, పాకిస్తాన్‌కు చెందిన లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాదులు పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్నారు. ఈ ఉగ్రవాద చర్యను ఖండిస్తూ, మీరు రేపు ప్రార్థనలకు వెళ్ళినప్పుడు, దయచేసి మీ చేతికి నల్లటి బ్యాండ్ ధరించండి’’ అని వీడియో సందేశాన్ని పంచుకున్నారు.

‘‘పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి నా విజ్ఞప్తి: రేపు మీరు నమాజ్-ఎ-జుమ్మా ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు, మీ చేతికి నల్ల బ్యాండ్ ధరించండి. ఇలా చేయడం ద్వారా, విదేశీ శక్తులు భారతదేశ శాంతి మరియు ఐక్యతను బలహీనపరచనివ్వబోమని మేము భారతీయులందరికీ సందేశం పంపుదాము’’ అని హిందీలో ట్వీట్ చేశారు. ఈ దాడి కారణంగా, ఉగ్రవాదులకు మన కాశ్మీర్ సోదరుల్ని లక్ష్యం చేసుకునే అవకాశం లభించిందని ఓవైసీ అన్నారు.

Read Also: Netanyahu: మోడీకి ఫోన్ చేసిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ..

ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరయ్యారు. ప్రభుత్వం నుంచి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు హాజరయ్యారు. వీరితో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జన ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

అఖిల పక్ష సమావేశం తర్వాత ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించే దేశంపై కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసం వైమానిక మరియు నావికా దిగ్బంధన చేయడానికి మరియు ఆయుధ అమ్మకాలపై పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించడానికి అంతర్జాతీయ చట్టం కూడా మనకు అనుమతి ఇస్తుంది.’’ అని అన్నారు. అదే సమయంలో బైసరన్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలను ఎందుకు మోహరించలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. భద్రతా బలగాలు అక్కడికి చేరుకోవడానికి గంట సమయాన్ని ఎందుకు తీసుకున్నారని అడిగారు. ఉగ్రవాదులు మతాన్ని అడిగి హత్య చేయడానికి తాను ఖండిస్తున్నట్లు ఓవైసీ చెప్పారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.

Exit mobile version