ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందుకు పంజాబీయులు బయట వ్యక్తులను అంగీకరించబోరని తెలియడంతో కేజ్రీవాల్ వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. అయితే ఈ ప్రచారాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ తోసిపుచ్చారు.
ఇదిలా ఉంటే తాజాగా పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా మరో ఆరోపణ చేశారు. కేజ్రీవాల్.. పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ పేర్కొన్నారు. ఇటీవల ఈయన.. ఆప్‌కు చెందిన 32 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని బాంబ్ పేల్చారు. తాజాగా కేజ్రీవాల్.. రాజ్యసభ మార్గం వెతుకుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పొలిటికల్‌గా సంచలనంగా మారాయి.
ఇటీవల పంజాబ్‌లో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి చనిపోయారు. ఈ స్థానంలో బైపోల్ జరగనుంది. ఈ ఎన్నిక ద్వారా కేజ్రీవాల్.. పంజాబ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూశారని ఆరోపణలు ఉన్నాయి. వ్యతిరేకత కారణంగా ఆయన వెనక్కి తగ్గినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఉపఎన్నికలో ఆప్ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను బరిలోకి దింపాలని చూస్తున్నారు. లూథియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో సంజీవ్ అరోరా పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ఊహాగానాలు అందుకున్నాయి. ఇక ఈ రాజ్యసభ సీటు ఖాళీ అయితే.. ఈ స్థానంలో కేజ్రీవాల్… రాజ్యసభలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కాంగ్రెస్ ఆరోపణలపై ఆప్ మాత్రం స్పందించలేదు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను.. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి నేతలంతా ఓటమి పాలయ్యారు. అతిషి మాత్రం అతి స్వల్ప మెజార్టీతో గట్టెక్కింది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.