NTV Telugu Site icon

Arvind Kejriwal: “నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు”.. కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని బలవంతం చేస్తు్న్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయినా కూడా తాను ఒత్తిళ్లకు లొంగబోనని తేల్చి చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ కేసును ఢిల్లీ క్రైం బ్రాంచ్ విచారిస్తోంది. ఇప్పటికే కేజ్రీవాల్‌కి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విచారణ మధ్యే కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం.

Read Also: CM Revanth Reddy: 46 ఏళ్ల తరువాత కూడా చిరంజీవిలో అదే తపన.. మెగాస్టార్ పై రేవంత్..

ఇదిలా ఉంటే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారిస్తున్న క్రైంబ్రాంచ్ ఇందుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాల్సిందిగా సీఎం కేజ్రీవాల్‌ని కోరింది. ఇదే రకమైన ఆరోపణలు చేసిన ఢిల్లీ మంత్రి అతిషిని కూడా ఆధారాలు సమర్పించాల్సిందిగా అడిగింది. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయాలని చూసిందని, మా 7 మంది ఎమ్మెల్యేలను వారు సంప్రదించారని, 21 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారని, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ. 25 కోట్లు ఇవ్వడంతో పాటు రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి టికెట్ ఇస్తామని ఆశ చూపినట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రతిపాదనను ఏడుగురు ఎమ్మెల్యేలు తిరస్కరించారని ఆయన చెప్పారు.

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే 5 సార్లు ఈడీ సమన్లను కేజ్రీవాల్ దాటవేశారు. దీంతో ఢిల్లీ రోస్ ఎవెన్యూ కోర్టుకు వెళ్లింది ఈడీ. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కి రానున్న రోజుల్లో మరిన్ని చిక్కులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఆప్ కీలక నేతలు సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసి జైళ్లో వేసింది. అయితే, తనను కూడా అరెస్ట్ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.