Army Assault Dog Zoom Who Continued To Fight Despite Bullet Injuries: ఉగ్రమూకలు మన భారత్ జోలికి వచ్చినప్పుడు.. ప్రాణాలకు తెగించి సైనికులు ఎలా పోరాడుతారో, అలాగే ఒక ఆర్మీ శునకం తన నిబద్ధతను చాటింది. తన బాడీలో రెండు బుల్లెట్లు దూసుకెళ్లినా.. వెనకడుగు వేయకుండా ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడింది. ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కశ్మీర్‌లోని తంగపావా ప్రాంతంలో, ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు నక్కినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో.. భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. తమతో పాటు ఓ శునకాన్ని కూడా తీసుకెళ్లిన సైనికులు.. ఆ ఉగ్రవాదుల జాడ కనుక్కునే పనిని దానికి అప్పగించారు.
ఆ శునకం పేరు జూమ్. తనకు అప్పగించిన పనిని ఇది సమర్థవంతంగా చేసింది. ఉగ్రవాదులు ఎక్కడున్నారో కనుక్కొని.. వారిపై దాడికి ఎగబడింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు గన్‌తో కాల్చారు. ఈ కాల్పుల్లో జూమ్ శరీరంలో రెండు తుపాకీ గుండ్లు దూసుకెళ్లాయి. అయినా అది వెనక్కు తగ్గలేదు. తన పోరాటాన్ని కొనసాగించింది. ఆ ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోకుండా అడ్డుకుంది. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు.. ఎన్‌కౌంటర్‌లో భాగంగా ఆ ఉగ్రవాదుల్ని మట్టుపెట్టాయి. మరోవైపు.. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జూమ్‌ను ఆర్మీకి చెందిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు సైనికులు కూడా గాయపడ్డారు.
జూమ్‌కి తాము కఠిన శిక్షణ ఇచ్చామని, అది ఎంతో నిబద్ధత కలిగినదని అధికారులు వెల్లడించారు. కేవలం ఇదొక్కటే కాదు.. గతంలో కూడా ఎన్నో ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించిన అనుభవం ఈ జూమ్‌కి ఉందని తెలిపారు. కాగా.. జూమ్ ధైర్యసాహసాలకు మెచ్చి, ప్రజలు దానిపై సోషల్ మీడియా మాధ్యమంగా ప్రశంసల కురిపిస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన జూమ్.. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.