Site icon NTV Telugu

Kamal Haasan: ‘‘మీరేమైనా చరిత్రకారులా..?’’ కన్నడ వ్యాఖ్యలపై కమల్ హసన్‌ని మందలించిన కోర్టు..

Kamal Haasan

Kamal Haasan

Kamal Haasan: యాక్టర్ కమల్ హాసన్‌ని కర్ణాటక హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఇటీవల, ఆయన కొత్త చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అని వ్యాఖ్యలు చేశాడు. అయితే, దీనిపై కర్ణాటకలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తమ భాషను తక్కువ చేసి మాట్లాడారని, క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆయన సినిమా కర్ణాటక లో విడుదల కాకుండా అడ్డుకుంటామని కన్నడిగులు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో తన సినిమా రిలీజ్ అయ్యేందుకు, ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా ఉండేలా అధికారుల్ని ఆదేశించాలని కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రకటన ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటూ, కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడాన్ని జస్టిస్ ఎం నాగప్రసన్న ప్రశ్నించారు. “ఏ పౌరుడి మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదు” అని న్యాయమూర్తి అన్నారు. ‘‘నీరు, భూమి, భాష పౌరులకు ముఖ్యమైనవి, భాషాపరమైన అంశాలపై దేశంలో విభజన జరిగింది’’ అని అన్నారు.

Read Also: Honour Killing: టిక్‌టాక్ చేస్తుందని 17 ఏళ్ల పాక్ యువతి పరువు హత్య..

కమల్ హాసన్ వైఖరిని కోర్టు తీవ్రంగా విమర్శించింది. ఒక నటుడిగా, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తిస్తారు.? అని ప్రశ్నించింది. “ఏ భాష మరొక భాష నుండి పుట్టదు. దీనికి మద్దతు ఇవ్వడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? కర్ణాటక ప్రజలు ఏమి అడిగారు? (కేవలం) క్షమాపణ.” అని న్యాయమూర్తి అన్నారు. కమల్ హాసన్ వాదనను జస్టిన్ నాగప్రసన్న ప్రశ్నించారు. ‘‘ఈ పరిస్థితులకు కారణం కమల్ హాసన్. మీరు దేని ఆధారంగా కర్ణాటక ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. మీరు ఎందుకు క్షమాపణ చెప్పరు..? మీరు చరిత్రకారులా..? లేక భాషావేత్తనా.?’’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే, కమల్ హాసన్ తరుపు న్యాయవాది మాట్లాడుతూ, ఆయనకు కించపరిచే ఉద్దేశ్యం లేదని, అంత తీవ్రమైన తప్పు కాదని అన్నారు. దీనికి జస్టిస్ నాగప్రసన్న తీవ్రంగా స్పందించారు. ‘‘మీరు క్షమాపణ చెప్పకపోతే కర్ణాటకలో సినిమా ఎందుకు నడపాలని మీరు కోరుకుంటున్నారు? దాన్ని వదిలేయండి. భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా విస్తరించకూడదు. మీరు క్షమాపణ చెప్పండి, అప్పుడు సమస్య లేదు. కర్ణాటక నుండి కూడా మీరు కొన్ని కోట్లు సంపాదించాలనుకుంటున్నారు.’’ అని అన్నారు. ఒక్క క్షమాపణ చెబితే అంతా పరిష్కారం అవుతుంది, కానీ ఆయన వైఖరిని చూడండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“దశాబ్దాల క్రితం రాజగోపాల్ ఆచార్య ఇలాంటి ప్రకటనకు క్షమాపణలు చెప్పారు. భాష అనేది ప్రజలకు సంబంధించిన ఒక భావోద్వేగం. దానిని దెబ్బతీసేలా మీరు ఏదో చెప్పారు.” అని కోర్టు వ్యాఖ్యానించింది. క్షమాపణలు చెప్పడం గురించి కమల్ హాసన్ ఆలోచించాలని, విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

Exit mobile version