NTV Telugu Site icon

Bengaluru Techie Suicide Case: 3 రోజుల్లో రావాలి.. అతుల్ సుభాష్ భార్యకి పోలీస్ సమన్లు..

Bengaluru Techie

Bengaluru Techie

Bengaluru: భార్య, ఆమె కుటుంబం వేధింపుల భరించేలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అక్రమ వరకట్న వేధింపుల కారణంగా తాను చనిపోతున్నట్లు సుభాష్ 24 పేజీల లేఖ, గంటలకు పైగా వీడియోను రికార్డ్ చేసి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వరకట్న, గృహహింస సెక్షన్ 498ఏని సమీక్షించాలని పలువురు కోరుతున్నారు. కొందరు మహిళలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చట్టాన్ని మిస్ యూజ్ చేస్తున్నారని మండిపడుతున్నారు.

Read Also: Allu Arjun: స్విమ్మింగ్ పూల్ లో అల్లు అర్జున్.. పోలీసుల రాకతో షాక్!

ఇదిలా ఉంటే, ఈ కేసులో ఉత్తర్ ప్రదేశ్‌లోని జౌన్ పూర్‌లో ఉంటున్న అతుల్ భార్య నికితా సింఘానియా, ఆమె కుటుంబానికి బెంగళూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరులోని మారతహళ్లి పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావడానికి వారికి 3 రోజుల సమయం ఇచ్చారు. బాధితుడు సుభాష్ సోదరుడు బికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు నలుగురు సభ్యులతో కూడిన బెంగళూర్ పోలీస్ టీం, యూపీ జౌన్‌పూర్‌లోని నిఖితా నివాసానికి వెళ్లి నోటీసులు అంటించారు. ఈ కేసులో అతుల్ సుభాష్ భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, ఆమె సోదరుడు అనురాగ్ సింఘానియా, ఆమె మేనమామ సుశీల్ సింఘానియాలకు నోటీసులు జారీ చేశారు. ‘‘వాస్తవాలు, పరిస్థితుల్ని నిర్ధారించేందుకు మిమ్మల్ని విచారించడానికి కారణాలు ఉన్నాయి. 3 రోజుల్లోగా బెంగళూర్‌లోని దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలి’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.

బీహార్‌కి చెందిన 34 ఏళ్ల అతుల్ సుభాష్, యూపీ జౌన్‌పూర్‌కి చెందిన నికితా సింఘానియాని 2019లో పెళ్లి చేసుకున్నాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సుభాష్ బెంగళూర్‌లో నివాసం ఉంటున్నాడు. అతడికి నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు. 2021లో నిఖితా, అతుల్‌ని కాదని పుట్టింటికి వెళ్లింది. అతడిపై వరకట్న వేధింపులు, గృహహింస సెక్షన్ల కింద కేసు పెట్టింది. నెలకు రూ. 2-4 లక్షల భరణాన్ని డిమాండ్ చేసింది. కేసును పరిష్కరించేందుకు రూ. 3 కోట్లు కావాలని నిఖితా కుటుంబం వేధించినట్లు అతుల్ ఆరోపించాడు. నిర్దోషినైనా తనకు కాకుండా న్యాయవ్యవస్థ ఆమెకే అండగా నిలిచిందని, చివకు జడ్జి కూడా కేసు సెటిల్మెంట్‌కి డబ్బులు అడిగినట్లు ఆరోపించారు.