Site icon NTV Telugu

Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్

Singer Zubeen Garg

Singer Zubeen Garg

అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత, బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో-సింగర్ అమృత్‌ప్రవ మహంతను అరెస్ట్ చేశారు. నలుగురిపై హత్య అభియోగాలు నమోదు చేశారు. తాజాగా మరొక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సింగపూర్ యాచ్ పార్టీలో ఉన్న జుబీన్ గార్గ్ పోలీస్ బంధువు సందీపన్ గార్గ్‌ను అరెస్ట్ చేశారు. సందీపన్ గార్గ్‌.. జుబీన్ గార్గ్‌తోనే ఉన్నట్లుగా అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. సందీపన్ గార్గ్‌.. అస్సాం పోలీస్ సర్వీస్‌లో ఉన్నాడు. ఈ కేసులో ఐదో అరెస్టు అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. సందీపన్‌ను కోర్టులో హాజరుపరుస్తామని, పోలీసు రిమాండ్ కోరుతామని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చీఫ్ ఎంపీ గుప్తా వెల్లడించారు. పోలీస్ సర్వీస్ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని అడిగినప్పుడు.. ఈరోజే అరెస్ట్ చేశామని సంబంధిత శాఖ తదుపరి చర్యలు తీసుకుంటుందని గుప్తా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: TATA War: టాటా గ్రూప్‌లో అంతర్యుద్ధం.. అమిత్ షా దగ్గరకు పంచాయితీ

ఇదిలా ఉంటే జుబీన్ గార్గ్ భద్రతా సిబ్బంది మాత్రం ఇప్పటి వరకు సింగపూర్ నుంచి భారత్‌కు రాలేదు. ఎన్నిసార్లు పిలిచినా స్పందన కరవైంది. ఈ నేపథ్యంలో వారి బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా కోటి రూపాయలు జమ అయినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ కేసు మరింత సీరియస్‌గా మారింది. ప్రస్తుతం ఇద్దరు భద్రతా సిబ్బందిని రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇద్దరూ అందుబాటులోకి రావడం లేదని సమాచారం.

ఇది కూడా చదవండి: Pakistan-US: అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసే యోచనలో పాక్!

జుబీన్ గార్గ్‌ మరణంలో వారిద్దరి ప్రమేయం ఉన్నట్లుగా అనుమానాలు తీవ్ర అవుతున్నాయి. వారికి అంత డబ్బు ఎలా వచ్చిందనే దానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసును ఆర్థిక కోణంలో కూడా దర్యాప్తు చేయాలని సిట్ బృందానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అక్టోబర్ 10న జుబీన్ గార్గ్ మరణంపై విసెరా నివేదిక రానున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సాక్షులు వాంగ్మూలంలో ఏదైనా చెప్పవచ్చు.. కానీ నివేదిక వచ్చాక అసలు విషయం బయటపడుతుందని చెప్పారు. అక్టోబర్ 11 నాటికి అన్ని అనుమానాలకు సమాధానాలు దొరకుతాయని పేర్కొన్నారు.

జుబీన్ గార్గ్ సింగపూర్‌లోని నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌‌కు వెళ్లారు. సెప్టెంబర్ 19న సముద్రంలో ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జుబీన్‌ గార్గ్ బ్యాండ్‌మేట్‌ శేఖర్‌జ్యోతి గోస్వామి తన వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు చేశాడు. గాయకుడికి ఆయన మేనేజర్‌, ఫెస్టివల్‌ నిర్వాహకుడు విషమిచ్చి ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉంటారని ఆరోపించాడు. జుబీన్‌ నోరు, ముక్కు నుంచి నురగ వస్తున్నప్పుడు కూడా మేనేజర్‌ ఏ మాత్రం కంగారు పడలేదని తెలిపాడు. వెంటనే వైద్యచికిత్స అందించకుండా ఆలస్యం చేశారని చెప్పుకొచ్చాడు.

Exit mobile version