Another Kashmiri Pandit Shot Dead By Terrorists in jammu kashmir: జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. మరో కాశ్మీరీ పండిట్‌ను కాల్చిచంపారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని చౌదరి గుండ్ ప్రాంతంలోని అతని నివాసానికి సమీపంలో పూరన్ క్రిషన్ భట్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటన శనివారం జరిగింది. కాల్పుల్లో గాయపడిన క్రిషన్ భట్ ను షోపియాన్ ఆస్పత్రికి తరలించిన తర్వాత మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు వేట ప్రారంభించాయి. ఘటన జరిగిన ప్రాంతాన్ని చుట్టుమట్టి గాలింపు చేపడుతున్నాయి.
Read Also: GN Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా జైల్లోనే.. మావోయిస్టు లింకుల కేసులో విడుదలపై సుప్రీం స్టే
క్రిషన్ భట్ కు ఇద్దరు పాఠశాలకు వెళ్లే పిల్లలు ఉన్నారు. 7వ తరగతి చదువుతున్న అమ్మాయితో పాటు 5వ తరగతి చదువుతున్న అబ్బాయి ఉన్నారు. కొద్ది నెలల క్రితం షోపియాన్ జిల్లాలో ఓ యాపిల్ తోటలో పనిచేస్తున్న సునీల్ కుమార్ ను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటనలో సునీల్ కుమార్ సోదరుడు పింటూ కుమార్ గాయపడ్డాడు. ఆగస్టు 16న ఈ ఘటన జరిగింది. ఆ తరువాత మళ్లీ ఇప్పుడే ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్ ను టార్గెట్ చేసి చంపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘తిరంగా ర్యాలీ’లో పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించినందుకు వీరిద్దరిని లక్ష్యంగా చేసుకున్నట్లు అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ‘కాశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్’ తెలిపింది.
ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్ లో వరసగా హిందువులను, పండిట్లను, వలస కూలీలు, స్థానికేతరులను టార్గెట్ గా చేసుకుంటూ దాడులకు పాల్పడుతున్నాయి ఉగ్రవాద సంస్థలు. ఇలా కొత్తరకం హైబ్రీడ్ టెర్రరిజానికి పాల్పడుతున్నాయి. గతంలో మేనెలలో బుద్గామ్ జిల్లాలో రాహుల్ భట్ అనే కాశ్మీరీ పండిట్ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న క్రమంలో అతి దగ్గర నుంచి ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఘటనపై అప్పట్లో కాశ్మీర్ లో ఉన్న హిందువులు అంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత అమ్రీన్ భట్ అనే టీవీ నటిని కూడా కాల్చిచంపారు ఉగ్రవాదులు. ఆ తరువాత ఓ హిందూ మహిళా ఉపాధ్యాయురాలిని, స్థానికేతరుడైన బ్యాంకు మేనేజర్ తో పాటు బీహార్ వలస కూలీలపై కాల్చుపులు జరిపి ప్రాణాలు తీశారు టెర్రరిస్టులు. గతేడాది అక్టోబర్ నెలలో ఐదు రోజుల్లో ఏడుగురు పౌరులు మరణించారు. ఇందులో ఓ కాశ్మీరీ పండిట్ ఉండగా.. ఓ సిక్కు, ఇద్దరు వలస హిందువులు ఉన్నారు.