Site icon NTV Telugu

Annamalai: తమిళనాడులో బీజేపీ ఫలితాలపై అన్నామలై కీలక వ్యాఖ్యలు..

Annamalai

Annamalai

Annamalai: తమిళనాడులో తమ ఉనికిని చాటాలని భావించిన బీజేపీకి నిరాశే ఎదురైంది. ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. ఎగ్జిట్ పోల్స్‌లో కనీసం 3 సీట్ల వరకు వస్తాయని అంతా భావించారు. కానీ నిజమైన ఫలితాల్లో సున్నాకే పరిమితమయ్యారు. ముఖ్యంగా బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న కోయంబత్తూర్ ఎంపీ స్థానం నుంచి ఆ పార్టీ చీఫ్ అన్నామలై గెలుస్తారని దేశం మొత్తం భావించింది. అయితే, ఈ స్థానంలో అధికార డీఎంకే అభ్యర్థి చేతిలో అన్నామలై ఓడిపోయారు. సీట్లు రాకున్నా గతంతో పోలిస్తే ఈసారి బీజేపీ తన సీట్ల శాతాన్ని పెంచుకుంది.

Read Also: Mobile Theft: జాగ్రత్త గురూ.. రైల్వే స్టేషన్స్ లో మొబైల్స్ ఇలా కూడా దొంగలిస్తున్నారు.. వీడియో వైరల్..

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఓటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆదేశాన్ని అంగీకరిస్తు్న్నామని, మాకు ఆశించిన సీట్లు రాలేదని చెప్పారు. అయితే, మూడోసారి నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సంతోషం కలిగిస్తుందని అన్నారు. తాము తమిళనాడు నుంచి ఎన్డీయే కూటమికి మద్దతుగా ఎంపీలను పంపుతామని భావించామని చెప్పారు. ఎక్కడ పొరపాటు జరిగిందో విశ్లేషించుకుంటామని అన్నారు. ఇండియా కూటమి నుంచి ఎన్నికైన ఎంపీలకు కూడా అన్నామలై శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి మంచి పథకాలు తీసుకురావాలని కోరారు. ఈ ఎన్నికల్ని గుణపాఠంగా భావించి, గతంలో కన్నా మెరుగైన పనితీరును కనబరుస్తామని చెప్పారు.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మూడోసారి అధికారం ఏర్పాటు చేయడమనేది ఎంత కష్టమో తెలుసని, అయితే, నరేంద్రమోడీ మూడోసారి అధికారంలోకి వస్తున్నారని చెప్పారు. తమ ఓటు శాతం బాగా పెరిందని అన్నామలై చెప్పారు. కమలం గుర్తు రాష్ట్రంలోని 39 స్థానాల్లోని 23 చోట్ల గట్టిగా నిలబడిందని అన్నారు. 20 ఏళ్లలో తొలిసారి తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో బీజేపీకి మంచి ఓట్లు వచ్చాయని చెప్పారు. వచ్చేసారి ఓట్ల శాతాన్ని పెంచుకోవడమే కాకుండా ఎంపీలను తప్పకుండా పార్లమెంట్ పంపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version