NTV Telugu Site icon

Annamalai: మాజీ సీఎం జయలలితపై సంచలన వ్యాఖ్యలు చేసిన అన్నామలై.. ఏమన్నారంటే..

Annamalai

Annamalai

Annamalai: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై మాజీ సీఎం, దివంగత జయలలితను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రవిడ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న తమిళనాడులో జయలలిత ‘‘హిందుత్వ నాయకురాలి’’గా ఉందని అన్నారు. ఆమె అందరి కన్నా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలిగా పిలిచారు. ఇటీవల పీటీఐతో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకే హిందుత్వ భావజాలానికి దూరమైన తర్వాత తమిళనాడులో ఏర్పడిన శూన్యతను పూరించడానికి బీజేపికీ మంచి అవకాశం ఉందని అన్నారు.

‘‘జయలలిత జీవించి ఉన్నంత వరకు ఆమె తమిళనాడులో అందరికన్నా చాలా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలు. 2014కి ముందు, బీజేపీలో జయలలిత వంటి లీడర్లు కలిసి ఉన్నప్పుడు, హిందుత్వ భావజాలం ఉన్న ఓటర్లకు సహజంగానే జయలలిత ఒక ఛాయిస్. ఆమె తన హిందూత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు’’ అని అన్నామలై వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మద్దతునిచ్చారని, 2002-03లో తమిళనాడులో మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించిన బీజేపీయేతర నాయకురాలిగా జయలలిత చరిత్ర సృష్టించారని చెప్పారు.

Read Also: Arvind Kejriwal: రాహుల్ గాంధీకే కాదు, కేజ్రీవాల్‌కి కూడా పాకిస్తాన్ నుంచి మద్దతు..బీజేపీ ఫైర్

అయితే, అన్నామలై ప్రకటనపై జయలలిత స్నేహితురాలు వీకే శశికళ స్పందించారు. అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఆయనకు జయలలితపై ఉన్న అజ్ఞానాన్ని, అపార్థాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొన్నాయని అన్నారు. జయలలిత లాంటి ప్రజా నాయకుడిని ఎవరూ ఇరుకున పెట్టలేరని శశికళ చెప్పారు. ఆమె చివరి శ్వాస వరకు ఎంజీఆర్ చూపిన బాటలోనే నిజమైన ద్రవిడ నాయకురాలిగా జీవించారని హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల వారు కీర్తించుకునే నాయకురాలని, అమ్మ కుల మత అడ్డంకుల్ని అధిగమించిన గొప్ప నాయకురాలని, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.

జయలలితకు దేవుడిపై విశ్వాసం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని, అయితే ఆమె ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదని శశికళ అన్నారు. అందరినీ సమానంగా చూసే ఏకైక నాయకురాలు జయలలిత అని శశికళ అన్నారు. ఇదిలా ఉంటే అన్నామలై జయలలితను హిందుత్వ నాయకురాలిగా పేర్కొనడంపై అన్నాడీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. అందరూ ఒక్కటే, దేవుడు ఒక్కడే అనేది అన్నాడీఎంకే సిద్ధాంతాల్లో ఒకటని, మా నాయకురాలు అమ్మ ఆ సిద్ధాంతంపై ఆధారపడి జీవించారని చెప్పింది. అన్నామలై ప్రకారం చూస్తే మా నాయకురాలు హిందుత్వానికి గొప్ప నాయకుడిగా ఉండాలి కానీ మోడీ కాదని, అన్నామలై జూన్ 4 తర్వాత ఏఐడీఎంకేలో చేరడాన్ని స్వాగతిస్తానని, ఫలితాల తర్వాత అన్నామలై రాజకీయ గుర్తింపు ఉండబోదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కోవై సత్యన్ అన్నారు.