NTV Telugu Site icon

Amritpal Singh: జైలు నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్..

Amritpal Singh

Amritpal Singh

Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో నుంచి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆయన పంజాబ్‌లోని ఖాదూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఖదూర్‌ సాహిబ్‌లోని జిల్లా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ‘వారిస్‌ పంజాబ్‌ దే’ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ తరుపున న్యాయవాది హర్‌జోత్‌ సింగ్‌, అతని బంధువు సుఖ్‌చైన్‌ సింగ్‌తో పాటు మరో ఐదుగురు నామినేషన్‌ దాఖలు చేశారు.

Read Also: Kejriwal: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల.. ఆప్ శ్రేణులు ఘన స్వాగతం

దీనికి ముందు అమృత్‌పాల్ సింగ్ తండ్రి టార్సెమ్ సింగ్ మాట్లాడుతూ.. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కానీ ఒక వేళ ‘సంగత్’ ఆదేశిస్తే, తాను ఆ నిర్ణయాన్ని మార్చుకుంటానని చెప్పారు. చట్ట ప్రకారం, జైలులో ఉన్న అభ్యర్థి ఎన్నికల్లో గెలిస్తే జైలు లోపల ప్రమాణం చేసే నిబంధనలు లేవు, దీంతో అతడిని ప్రమాణ స్వీకారం చేసేందుకు జైలు నుంచి విడుదల చేయవచ్చు.

గతేడాది ఏప్రిల్ నెలలో అమృత్ పాల్ సింగ్ ఖలిస్తాన్‌కి అనుకూలంగా, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్‌పై తన మద్దతుదారులతో కలిసి దాడి చేశారు. భారత రాజ్యాంగం తనను అంగీకరించినప్పుడే తాను అంగీకరిస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు. అమృతపాల్ సింగ్‌ను గత ఏడాది ఏప్రిల్ 23న కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేశారు. ఖాదూర్ సాహిబ్ జూన్ 1న లోక్‌సభ ఎన్నికల ఏడో దశలో పోలింగ్‌ జరగనుంది.