NTV Telugu Site icon

Bhagwant Mann: ఖలిస్తానీ మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ నుంచి పంజాబ్ సీఎంకి ప్రాణహాని..

Bhagwant Mann

Bhagwant Mann

Bhagwant Mann: ఖలిస్తాన్ మద్దతుదారు, ఈ ఏడాది పంజాబ్ లోని ఖదూర్ సాహిబ్ ఎంపీగా గెలిచిన అమృత్‌పాల్ సింగ్ నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌‌కి ప్రాణహాని ఉందని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు. అమృత్‌పాల్, అతడి సన్నిహితుల నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలకే కాకుండా, సీఎం ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పారు. పంజాబ్ పోలీసులు వారి వాదనలకు మద్దతుగా గతంలో అమృత్‌పాల్ సింగ్ చేసిన ప్రసంగాలకు సంబంధించి వీడియో క్లిప్‌లను ప్రస్తావించారు.

పంజాబ్ పోలీసులు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ముందు ఈ వాదనలు చేశారు. అమృత్‌సర్(రూరల్) ఎస్ఎస్పీ చరణ్‌జిత్ సింగ్ ద్వారా కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేయబడింది. అమృత్‌పాల్ సింగ్‌కి సంబంధించిన ఓ వీడియోలో.. దివంగత పంజాబ్ మాజీ సీఎ బియాంత్ సింగ్‌కి పట్టిన గతే భగవంత్ మాన్‌కి పడుతుందని హెచ్చరించాడు. బియాంత్ సింగ్ మార్గంలోనే ఆయన పనిచేస్తు్న్నారని, మానవబాంబుతో భగవంత్ మాన్‌ని హత్య చేస్తామని బెదిరించారు. ఈ వీడియోని పోలీసులు కోర్టు ముందు ఉంచారు.

Read Also: Chiranjeevi: బ్రేకింగ్: గిన్నీస్ బుక్ లోకి చిరంజీవి

పంజాబ్ పోలీస్ అధికారి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఫిబ్రవరి 2023 అజ్నాలా పోలీస్ స్టేషన్ సంఘటన తర్వాత, అమ్రిత్‌పాల్ సింగ్ అజ్నాలా పోలీస్ స్టేషన్ వెలుపల మాట్లాడిన వీడియోలో.. మాజీ సీఎం బియాంత్ సింగ్‌కి పట్టిన విధినే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎదుర్కొంటారని హెచ్చరించారు. ‘‘సీఎం భగవంత్ మాన్, మాజీ సీఎం బియాంత్ సింగ్ దారిలో నడవద్దని హెచ్చరిస్తున్నాము. సీఎం మాన్ ఇప్పటికీ ఆయన దారిలోనే నడుస్తున్నాడు. దిలావర్ ఒక మానవబాంబుగా మారి సీఎం బియాంత్ సింగ్‌ని పేల్చేశాడు. ఈ రోజు ఈ జనసమూహం నుంచి అనేక మంది దిలావర్‌లు పుట్టుకొచ్చారని గుర్తుంచుకో. ’’ అని అమృత్‌పాల్ సింగ్ హెచ్చరించిన వీడియోని పంజాబ్ పోలీసులు ప్రస్తావించారు.

అమృత్‌పాల్ సింగ్ చేసిన ఉద్వేగభరితమైన మాటలు పంజాబ్ యువతను, ఇతర దేశాలలో తప్పుదోవ పట్టించే ధోరణిలో ఉన్నాయని, ఈ చర్యలు యువతను దిలావర్ సింగ్‌గా మారి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ముఖ్యమంత్రి మాన్‌ని హత్య చేయాలని ప్రోత్సహిస్తున్నాయని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ భావజాలంతో ఏకీభవించని ప్రతీ ఒక్కరికి కూడా హాని కలిగించే విధంగా, శాంతిభద్రతలకు, పబ్లిక్ ఆర్డర్‌కి ఇబ్బందులు తలెత్తుతాయని పంజాబ్ పోలీసులు హైకోర్టులో సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం అమృత్‌పాల్ సింగ్ దేశ భద్రత చట్టాల కింద అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. ఇతని అనుచరులు సరబ్జీత్ సింగ్ కల్సి మరియు గుర్మీత్ సింగ్ గిల్ అలియాస్ గుర్మీత్ భుక్కన్‌వాలా దాఖలు చేసిన వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తమను నిర్భందించడాన్నా వీరు సవాల్ చేశారు. దీనికి సమాధానంగానే పంజాబ్ పోలీసులు కోర్టుకు వివరణ ఇచ్చారు.