NTV Telugu Site icon

Amit Shah: ‘రాహుల్ బాబా’ విమానం నవంబర్ 20న మళ్లీ కూలిపోతుంది

Amitshah

Amitshah

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఇండియా కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ టార్గె్ట్‌గా కేంద్రమంత్రి నిప్పులు చెరిగారు. ‘‘రాహుల్ బాబా’’ అనే పేరు కలిగిన విమానం ఇప్పటికే 20 సార్లు కూలిపోయిందని, నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత 21వ సారి కూలిపోనుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జోస్యం చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్బని జిల్లా జింటూరులో బుధవారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ బాబా పేరుతో ఉన్న విమానాన్ని 20 సార్లు ల్యాండ్ చేయడానికి సోనియాగాంధీ ప్రయత్నించగా 20 సార్లు కూలిపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో మళ్లీ మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఈసారి కూడా సోనియా ప్రయత్నం బెడిసికొడుతుందని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Raghuramakrishnaraju: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు నామినేషన్..

అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగకుండా కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఏళ్ల తరబడి నిలిపేసిందని ఆరోపించారు. నరేంద్ర మోడీ అయోధ్యలో రామాలయ నిర్మాణం, ఔరంగజేబు కూల్చేసిన కాశీ విశ్వనాథ ఆలయానికి కారిడార్ నిర్మించారని గుర్తు చేశారు. ఇప్పుడు గుజరాత్‌లో స్వర్ణ సోమనాథ ఆలయాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. భారతదేశాన్ని సురక్షితమైన, సౌభాగ్యవంతమైన దేశంగా మోడీ తీర్చిదిద్దారని అమిత్ షా ప్రశంసించారు.

మహారాష్ట్రలో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి. మహారాష్ట్రలో ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. మరొకసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తుంది. రాష్ట్ర ప్రజలు ఏ కూటమికి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.

Show comments