NTV Telugu Site icon

Rahul Gandhi: “అమిత్ షాకి చరిత్ర తిరగరాసే అలవాటు ఉంది”.. నెహ్రూ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ వివాదంపై భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఉద్దేశిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. హోమంత్రికి చరిత్రను తిరగరాసే అలవాటు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘పండిట్ నెహ్రూ దేశం కోసం తన జీవితాన్ని అర్పించారు, ఏళ్ల తరబడి జైలులో ఉన్నారు. అమిత్ షాకు చరిత్ర తెలియదు. ఆయనకు చరిత్ర తెలుస్తుందని నేను ఆశించను. అతనికి దానిని తిరగరాసే అలవాటు ఉంది’’ అంటూ మంగళవారం పార్లమెంట్ వెలుపల మీడియాతో రాహుల్ గాంధీ అన్నారు. కులగణన, నిరుద్యోగం, దేశంలోని ధనమంతా ఎవరి చేతుల్లో ఉంది, ఇవన్ని ప్రధాన అంశాలు, వీటిని చర్చించేందుకు బీజేపీ భయపడుతోంది, అందుకే వీటి నుంచి పారిపోతుందని బీజేపీపై రాహుల్ గాంధీ ఆరోపించారు.

Read Also: Renuka Ardhya: ఫ్యామిలీ కోసం భిక్షాటన.. ఇప్పుడు బిలియనీర్.. 1000 కార్లు, వేల సంఖ్యలో ఉద్యోగులు

ప్రజలను సమస్యల నుంచి మళ్లించే మార్గమని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన, జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. ఇటీవల పార్లమెంట్‌లో అమిత్ షా మాట్లాడారు. నెహ్రూ మూలంగానే కాశ్మీర్ సమస్య ఏర్పడిందని, ఆయన చేసిన రెండు తప్పులే పీఓకే సమస్యకు కారణమైందని ఆరోపించారు. కాల్పుల విరమణకు భారత్ పిలుపునివ్వకపోతే, కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లకపోతే ఈ రోజు కాశ్మీర్ మొత్తం భారత్‌లో అంతర్భాగంగా ఉండేని షా అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ మనీష్ తివారీ ఖండించారు. అప్పటి భారత ఆర్మీ జనరల్ రాయ్ బుచెర్ అప్పటి ప్రభుత్వానికి సలహా ఇచ్చినందున కాల్పుల విరమణ జరిగిందని అన్నారు.