Site icon NTV Telugu

Amartya Sen: భారత్ హిందూదేశం కాదు.. లోక్‌సభ ఎన్నికలనే నిదర్శనం..

Amartya Sen

Amartya Sen

Amartya Sen: లోక్‌సభ ఎన్నికలపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ హిందూదేశం కాదని ఇటీవల లోక్‌సభ ఎన్నికలు నిరూపించాయని అన్నారు. బుధవారం అమెరికా నుంచి కోల్‌కతా చేసుకున్న ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఎలాంటి విచారణ లేకుండా జైలులోకి నెట్టడం కాంగ్రెస్ పాలనలో కన్నా బీజేపీ పాలనలో మరింత తీవ్రంగా ఉందని ఆరోపించారు. ప్రతీ ఎన్నికల తర్వాత మార్పును ఆశిస్తామని, పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు పెంచడం వంటివి జరిగేవని, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయిన ఆయన అన్నారు. ఇలాంట వాటికి అడ్డుకట్టపడాల్సిన అవసరముందని చెప్పారు.

Read Also: Delhi Airport : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన పైకప్పు.. ఆరుగురికి గాయాలు.. చాలా వాహనాలు ధ్వంసం

లౌకిక దేశమైన భారత్‌లో రాజకీయాలు పారదర్శకంగా ఉండాలని చెప్పారు. హిందూ దేశంగా మార్చాలనే భావన సరికాదని చెప్పారు. అయోధ్యలో రామమందిరం నిర్మించిన యూపీలోని ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమిపై స్పందిస్తూ.. భారతదేశానికి ఉన్న నిజమైన గుర్తింపు కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. మహాత్మాగాంధీ, రవీంద్ర నాథ్ ఠాగూర్, నేతాజీ పుట్టిన దేశంలో ఎంతో ధనం వెచ్చించి రామాలయం నిర్మించి భారతదేశాన్ని హిందూ దేశంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది కాదని చెప్పారు. ఇండియాలో నిరుద్యోగం పెరిగిందని ప్రాథమిక విద్యా, ప్రాథమిక ఆరోగ్య సేవల వంటి రంగాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

అయితే, అమర్త్యసేన్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అయింది. ఆయన వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు సంబంధం లేకుండా ఉన్నాయని బెంగాల్ బీజేపీ సీనియర్ నేత రాహుల్ సిన్హా అన్నారు. దేశంలో పరిణామాలను ఆయన తటస్థ దృష్టితో చూడాలని సూచించారు. అమెరికాలో ఉంటూ వ్యక్తిగత పనులపై భారత్‌కి అప్పుడప్పుడు వచ్చే అమర్త్యసేన్ మాటలకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని మాజీ కేంద్ర మంత్రి దేబాశ్రీ చౌదరి అన్నారు.

Exit mobile version