NTV Telugu Site icon

Live-In RelationShip: సహజీవనంపై అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు..

Allahabad High Court

Allahabad High Court

Live-In RelationShip: దేశంతోపాటు.. ప్రపంచ వ్యాప్తంగా సహజీవనం పెరిగిపోతోంది. కుటుంబ వ్యవస్థలోకి రాకుండా.. సమస్యల సుడిగుండంలో ఉండకూడదనే ఉద్దేశంతో కొందరు ఈ సహజీవనం వైపు వెళుతున్నారు. సహజీవనం నేపథ్యంలో కొన్ని సంవత్సరాల తరువాత గొడవల కారణంగా హత్యలు జరుగుతున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సహజీవనంపై అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనాన్ని వివాహపరమైన సంబంధంగా పరిగణించేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధం, అనైతికమని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. 18 ఏళ్లలోపు ఉన్న అబ్బాయి.. వయస్సులో తన కంటే పెద్దదైన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడనే కారణంతో నేర విచారణ నుంచి రక్షణ పొందలేడని, వారి చర్యలు చట్టపరమైనవి కాదని జస్టిస్‌ వివేక్‌ కుమార్‌ బిర్లా, జస్టిస్‌ రాజేంద్ర కుమార్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది.

Read also: ICC World Cup: వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్లో మార్పులు.. ఒక్కరోజు ముందుగానే భారత్, పాక్ మ్యాచ్

కొద్దిరోజుల క్రితం ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అబ్బాయి ఇంట్లోంచి వచ్చి ప్రయాగ్‌రాజ్‌లో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అమ్మాయి కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారి ఆచూకీ తెలియడంతో అమ్మాయి కుటుంబసభ్యులు ఇద్దరిని బలవంతంగా వారి గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తప్పించుకున్న అమ్మాయి.. జరిగిన ఘటన మొత్తాన్ని అబ్బాయి తండ్రికి తెలియజేసింది. దీంతో ఆయన అబ్బాయి తరపున కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దాంతోపాటు అబ్బాయిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని అమ్మాయి మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్‌ న్యాయస్థానం 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం అనైతికమని వ్యాఖ్యానించింది. ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా జీవించేందుకు హక్కు ఉంటుందని, అయితే.. వారు మేజర్లు అయి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నమోదైన కేసులో అబ్బాయిపై మోపిన నేరానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా, నేరం జరిగిందనే అభిప్రాయానికి రాలేమని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై సమగ్ర విచారణ చేయాలని దర్యాప్తు అధికారిని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది.