Allahabad High Court verdict on second marriage of Muslim man: ముస్లిం వ్యక్తి రెండో వివాహంపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మొదటి భార్య, ఆమె సంతానాన్ని చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో పెళ్లి చేసుకునే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఒక ముస్లిం వ్యక్తి తన భార్య, పిల్లలను చూసుకోకపోతే, ఖురాన్ అతన్ని రెండవ వివాహం చేసుకోవడానికి అనుమతించదని తీర్పు వెల్లడించింది. మొదటి భార్య అనుమతి లేకుండా రెండో వివాహాం చేసుకున్న వ్యక్తి మొదటి భార్యను శిక్షించడమే అవుతుందని అంది. న్యాయమూర్తులు సూర్య ప్రకాష్ కేసర్వాణి, రాజేంద్ర కుమార్ లో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక ముస్లిం వ్యక్తి తన భార్య, పిల్లలను పోషించే సామర్థ్యం లేకుంటే.. పవిత్ర ఖురాన్ పేర్కొన్న ఆదేశాల మేరకు మరో స్త్రీని వివాహం చేసుకోలేదని పేర్కొంది.
Read Also: Komatireddy Rajgopal Reddy : దేశంలోనే ఇది అతిపెద్ద కుంభకోణం ధరణి
ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే.. అజీజ్ ఉర్ రెహ్మన్, హమీదున్నీషా మే 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. అయితే మొదటి భార్యకు తెలియకుండా అజీజ్ ఉర్ రెహ్మన్ మరో వివాహం చేసుకున్నాడు. రెండోభార్యకు కూడా పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని మొదటి భార్య హమీదున్నీషాకు తెలియకుండా దాచిపెట్టాడు. దీంతో హమీదున్నీషా తన భర్త దగ్గర నుంచి విడిపోయి పుట్టింటికి చేరింది. 2015లో అజీజ్ ఉర్ రెహ్మన్ ఉత్తర్ ప్రదేశ్ లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన మొదటి భార్య తనతో కలిసి ఉండేలా ఆదేశించాలని కోరాడు. ఫ్యామిలీ హైకోర్టు ఈ కేసును తిరస్కరించడంతో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసులో ఖురాన్ లోని సురా 4 అయత్ 3ని ప్రస్తావించింది అలహాబాద్ హైకోర్టు. మొదటి భార్య ఉండగానే ముస్లిం వ్యక్తి రెండో పెళ్లి చేసుకునేందుకు చట్టబద్ధమైన హక్కు కలిగి ఉన్నాడని వివరించింది. అయితే.. అతను మొదటి భార్యను తనతో జీవించమని బలవంతం చేయమని కోరడం అన్యాయం, అసమానతకు దారి తీస్తుందని కోర్టు పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతీ భారతీయుడు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని.. ఆర్టికల్ 14 అందరికీ సమానత్వపు హక్కును కల్పిస్తుందని.. ఆర్టిక్ 15(2) ప్రకారం వ్యక్తిగత చట్టాల పేరుతో పౌరులు రాజ్యాంగ హక్కులను దూరం చేయడం కుదరదని స్పష్టం చేసింది. గౌరవప్రదంగా జీవించే హక్కు జీవించే హక్కుల్లో భాగం అని.. మహిళను గౌరవించలేదని సమాజాన్ని నాగరికత అనలేమని కోర్టు పేర్కొంది.
