NTV Telugu Site icon

Kumbh Mela: “వక్ఫ్” భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారు..

Kumbh Mela

Kumbh Mela

Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది యోగి సర్కార్. మరికొన్ని రోజుల్లో కుంభమేళా ప్రారంభం కాబోతోంది. అయితే, ఆల్‌ ఇండియా ముస్లిం జమాత్‌ ప్రెసిడెంట్‌ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వక్ఫ్ భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారని, దీనికి అనుమతించడం ద్వారా ముస్లింలు పెద్ద మనసుని చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముస్లింలను కూడా అనుమతించడం ద్వారా హిందువులు ప్రతిస్పందించాలని కోరారు.

Read Also: Bombay High Court: ఒక్కసారి మాత్రమే అమ్మాయిని ఫాలో అవ్వడం వేధించడం కాదు..

దాదాపు 34 ఎకరాల భూమిని హిందూ మతపరమైన కార్యక్రమానికి వినియోగిస్తు్నారని బరేల్వీ పేర్కొన్నారు. హిందూయేతరులు కుంభమేళాకు రాకుండా అడ్డుకోవాలని భారత అఖారా పరిషత్ పిలుపు ఇవ్వడాన్ని బర్వేలీ తప్పుపట్టారు. కుంభమేళా నుండి ముస్లింల ప్రవేశాన్ని అఖారా పరిషత్, నాగ సన్యాసులు, స్వామీలు మరియు బాబాలు నిషేధించారు. సర్తాజ్ అనే ముస్లిం వ్యక్తి కుంభమేళా జరుగుతున్న స్థలం వక్ఫ్‌కి చెందుతుందని, అది స్థానిక ముస్లింలకు సొంతమని చెప్పాడు.

ముస్లింలు భూములు ఇస్తూ విశాల మనసుతో వ్యవహరిస్తుంటే, కుంభమేళాకు ముస్లింలను అనుమతించకుండా హిందూ సంఘాలు సంకుచితతత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని బర్వేలీ విమర్శించారు. అయితే, ఈ వ్యాఖ్యలను హిందూ నేతలు తోసిపుచ్చారు. హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ మాట్లాడుతూ మౌలానా షహబుద్దీన్‌ను పాకిస్థాన్ స్పాన్సర్ చేస్తుందని ఆరోపించారు. అతను ఉగ్రవాద మనస్తత్వం ఉన్న వ్యక్తి అని అన్నారు. కుంభమేళకు భంగం కలిగించేందుకు ఇలాంటి వారు వ్యవహరిస్తున్నారని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Show comments