Rajnath Singh: దేశంలో ‘‘వైట్ కాలర్ టెర్రరిజం’’ ఆందోళన కలిగిస్తోందని, విద్యావంతులు సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు. ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్‌ను ఆయన ప్రస్తావించారు. ఈ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారు, కుట్రదారులు అంతా హర్యానా ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వైద్యులుగా తేలింది. నవంబర్ 10న ఎర్రకోట పేలుడుకు పాల్పడిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ ఉన్ నబీగా గుర్తించారు. మరో ముగ్గురు వైద్యులు ముజమ్మిల్ గనాయ్, అదీల్ రథర్, షహీనా సయీద్‌తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు.
“ఈ రోజు దేశంలో వైట్-కాలర్ ఉగ్రవాదం అనే ఆందోళనకరమైన ధోరణి వెలుగులోకి వస్తోంది. ఉన్నత విద్యావంతులు సమాజానికి మరియు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు” అని ఉదయ్‌పూర్‌లో జరిగిన భూపాల్ నోబుల్స్ విశ్వవిద్యాలయం 104వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో రాజ్‌నాథ్ అన్నారు. “(ఢిల్లీ) బాంబు పేలుడుకు పాల్పడిన వారు వైద్యులు – ప్రిస్క్రిప్షన్‌లపై ‘Rx’ అని రాసేవారు, కానీ వారి చేతుల్లో RDX ఉంది. ఇది జ్ఞానంతో పాటు విలువలు, నైతికత కూడా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది” అని అన్నారు. చదువు ఉద్దేశం కేవలం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదని, నైతికత, నీతి, మానవ వ్యక్తిత్వ వికాసం అని కూడా ఆయన అన్నారు.
రాబోయే 15-20 సంవత్సరాలలో, భారతదేశం ఆయుధాలలో పూర్తిగా స్వావలంబన చెందుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఏఐ, మెషిన్ లర్నింగ్, ఇతర సాంకేతికతను భారత అభివృద్ధిని ముందుకు నడిపించడానికి ఉపయోగించుకోవాలని అన్నారు. భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ చెబుతూ.. యూనివర్సిటీలు ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. ఆత్మగౌరవ భావన, ఎప్పుడూ అహంకారంగా మారొద్దని చెప్పారు.
