Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక సభలో ప్రసంగిస్తూ.. ‘‘నేను మీకు ఒక సూచన ఇవ్వాలనుకోవడం లేదు, కానీ నేను రాముడి పేరు మీద ఒక సూచన ఇస్తాను. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా అన్ని నగరాలు ప్రకాశవంతంగా ఉంటాయి. ఆ లైట్లు నెలల తరబడి ఉంటాయి. దీపాలు, కొవ్వత్తుల కోసం డబ్బు ఎందుకు ఖర్చు చేస్తారు.? ఈ ప్రభుత్వం నుంచి మనం ఏం ఆశించవచ్చు, ప్రభుత్వాన్ని దింపేయాలి. మరిన్ని అందమైన లైట్లు ఉండేలా చూసుకుంటాము’’ అని అఖిలేష్ యాదవ్ అన్నారు. అయోధ్యలో లక్షల సంఖ్యలో దీపాలు వెలిగించడంపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై విశ్వ హిందూ పరిషత్ (VHP) తీవ్రంగా స్పందించింది. జాతీయ ప్రతినిధి వినోద్ బన్సల్ మాట్లాడుతూ.. ‘‘అఖిలేష్ యాదవ్ దీపావళి సమయంలో క్రిస్మస్ పండగను ప్రశంసిస్తున్నారు. దీపాలు అతడి హృదయాన్ని కాల్చేస్తున్నాయి, అతను వందకోట్ల మంది హిందువులు దీపాలు, కొవ్వొత్తుల కోసం డబ్బు వృథా చేయవద్దని, కిస్మస్ నుంచి నేర్చుకోవాలని చెబుతున్నాడు’’ అని విమర్శించారు. అఖిలేష్ హిందువు కన్నా క్రైస్తవుల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. భారతీయ సంస్కృతిపై దాడి చేస్తున్నారని అన్నారు.
Read Also: AUS vs IND: ఆస్ట్రేలియాతో భారత్ మొదటి వన్డే.. గంభీర్‌కు ఇష్టమైన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత!
‘‘క్రైస్తవ మతం లేనప్పుడు, దీపావళి సంప్రదాయాలతో జరుపుకునే వారు. ఇప్పుడు, అఖిలేష్ హిందూ సమాజం క్రైస్తవుల నుంచి నేర్చుకోవాలని చెబుతున్నాడు. రాముడు, కృష్ణుడు ఉన్న యూపీ లాంటి పవిత్ర భూమిపై, మాజీ సీఎం తన క్యాబినెట్‌ను నేరస్తులు, తీవ్రవాదులతో నింపాడు. ఆయన నాయకత్వంలోనే అక్రమ మతమార్పుడులు జరిగాయి’’ అని తీవ్రంగా విమర్శించారు.
అఖిలేష్‌కు రెండు నెలల దూరంలో ఉన్న విదేశీ క్రిస్మస్ పండగ ఇప్పుడే వచ్చినట్లు అనిపిస్తోందని, రెండు రోజుల దూరంలో ఉన్న దీపావళి కనిపించడం లేదని వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయోధ్య ప్రకాశవంతంగా వెలిగిపోవడం, హిందువుల ఆనందం పట్ల అసూయ సరైందని కాదని, అందుకే ఆయన పార్టీని అసమాజ్ వాదీ పార్టీగా పిలుస్తారు అని తీవ్రంగా విమర్శించింది.