Site icon NTV Telugu

Ajit Pawar : అజిత్ పవార్ విమానాన్ని నడిపిన పైలట్లు వీరే.. కెప్టెన్ సుమిత్ , శాంభవి పాఠక్..!

Ajit Pawar Pilots

Ajit Pawar Pilots

ముంబై నుంచి బారామతికి బయలుదేరిన అజిత్ పవార్ విమానం ఉదయం 8:45 – 9:15 గంటల మధ్య ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయ రన్‌వేపై దిగడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్‌వేకు బదులుగా సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి భూమిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ముక్కలుగా విరిగిపోవడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు (PA) విదిప్ జాదవ్, ఒక సెక్యూరిటీ ఆఫీసర్, , విమానాన్ని నడిపిన ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మరణించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ధృవీకరించింది.

ఈ విమానాన్ని అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్ సుమిత్ కపూర్ ప్రధాన పైలట్‌గా నడిపించగా, ఫస్ట్ ఆఫీసర్ శాంభవి పాఠక్ సహా పైలట్‌గా వ్యవహరించారు. ముంబై విశ్వవిద్యాలయంలో ఏవియేషన్ అభ్యసించిన శాంభవి, న్యూజిలాండ్‌లో అంతర్జాతీయ శిక్షణ పొంది 2022 నుండి ఈ సంస్థలో పనిచేస్తున్నారు. వీరితో పాటు పింకీ మాలి విమాన సహాయకురాలిగా విధులు నిర్వహించారు. ప్రమాదానికి గురైన ఈ లియర్‌జెట్ 45 విమానం (VT-SSK) ఢిల్లీకి చెందిన VSR వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందినది. 2011లో స్థాపించబడిన ఈ సంస్థ గతంలో కూడా 2023 సెప్టెంబర్ 14న ముంబైలో ఒక విమాన ప్రమాదాన్ని ఎదుర్కోవడం గమనార్హం.

విమానం కూలిన సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయితే మంటలు తీవ్రంగా ఉండటంతో విమానం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి DGCA ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. అజిత్ పవార్ మృతితో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్లయింది, రాష్ట్రవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.

Ajit Pawar: ‘‘రన్ వే కనిపించడం లేదు’’.. అజిత్ పవార్ చివరి క్షణాల్లో నాటకీయ పరిణామాలు..

Exit mobile version