Ajit Doval: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) సభ్యదేశాలు పరస్పరం తమ ప్రాదేశిక సమగ్రతను గౌరవించుకోవాలని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఎస్‌సిఓ స్థాయి ఎన్ఎస్ఏ సమావేశంలో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చారు.
Read Also: MLA Raja Singh: నవమి వేడుకలే లక్ష్యం.. నాపై ఉగ్ర కుట్ర పన్నారు
సభ్యదేశాలు సార్వభౌమాధికారం, దేశాల ప్రాదేశిక సమగ్రత, సరిహద్దు ఉల్లంఘన, సైనికంగా బలాన్ని ప్రయోగించడం వల్ల ముప్పు ఏర్పడుతుందని, సైనిక ఆధిపత్యాన్ని కోరుకోకుండా పరస్పరం గౌరవించుకోవాలని చెప్పారు. చైనాను ఉద్దేశించే దోవల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదం గురించి ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదం దాని అన్ని రూపాలను, ఉగ్రవాదానికి ఫండింగ్ అంతర్జాతీయ సమాజ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని అన్నారు.
భారతదేశం 2017లో ఎస్ సీ ఓలో సభ్యత్వం పొందింది. ప్రస్తుతం భారత్ తో పాటు పాకిస్తాన్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మొత్తం 8 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా పరిశీలక దేశాలుగా, ఆర్మేనియా, అజర్ బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీ భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. 2023 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కు భారత్ అధ్యక్షత వహిస్తోంది.