Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మాజీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) చీఫ్ సమంత్ గోయెల్‌పై ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ చేసిన ఆరోపణలను భారత్ మరోసారి తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, అమెరికా కోర్టులో దాఖలైన పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, పన్నూన్ కేసులో దోవల్, గోయెల్‌లకు సమన్లు అందచేసేందుకు భారత న్యాయస్థానాల సహకారం కోరుతూ అమెరికా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నవంబర్ 13న వెలువడిన ఉత్తర్వుల్లో న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్ కు చెందిన అమెరికా జిల్లా కోర్టు దోవల్‌కు సంబంధించిన సమన్లు, ఇతర న్యాయపత్రాలను ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టుకు పంపాలని ఆదేశించింది. మాజీ రా చీఫ్ సమంత్ గోయెల్‌కు సంబంధించిన పత్రాలు ద్వారక, తీస్ హజారీ కోర్టులకు పంపాలని కోర్టు క్లర్క్‌ను ఆదేశించింది. ఈ కేసులో ప్రతివాదులకు న్యాయపరమైన నోటీసులు అందించడానికి భారత న్యాయస్థానాల సహకారం కోరుతున్నట్లు జడ్జి కేథరిన్ పోల్క్ ఫైల్లా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, శుక్రవారం భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. పన్నూ పిటిషన్ నిరాధారమైందని, తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది.

