Site icon NTV Telugu

Air India plane crash: విమానం టేకాఫ్ వెనక ఉన్న సైన్స్ ఇదే.. విమాన గతిని నియంత్రించే 4 శక్తులు..

Plane Crash In Ahmedabad

Plane Crash In Ahmedabad

Air India plane crash: ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం దేశంలో విషాదాన్ని నింపింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌ గాట్విక్‌కి బయలుదేరిని విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, 241 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే, టేకాఫ్ అవుతున్న సమయంలోనే విమానం ఎలా కూలిందనే దానిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) దర్యాప్తు చేపట్టింది. విమానం కూలిపోతున్న సమయంలో దాని ల్యాండింగ్ గేర్ విస్తరించి ఉంది, రెక్కల్లోని ఫ్లాప్స్ పూర్తిగా వెనక్కి తీసుకోబడినట్లు కనిపిస్తోంది. టేకాఫ్ సమయంలో అసాధారణంగా విమానం కనిపించింది.

విమానం టేకాఫ్ వెనక సైన్స్:

విమానం ప్రధానంగా నాలుగు శక్తులపై ఆధారపడి పనిచేస్తుంది- లిఫ్ట్, బరువు, థ్రస్ట్, డ్రాగ్. ఈ నాలుగు ప్రాథమిక శక్తుల పరస్పర చర్య ద్వారా విమానం నియంత్రించబడుతుంది.

లిఫ్ట్ అనేది విమానం రెక్కల ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి. ఇది విమానం పైకి వెళ్లేందుకు సహాయపడుతుంది. బరువు అనేది గురుత్వాకర్షణ శక్తి ద్వారా కిందకు లాగబడుతుంది. ఇక థ్రస్ట్ విమానం ఇంజన్ల ద్వారా వస్తుంది. డ్రాగ్ అనేది విమానం గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు ఎదుర్కునే నిరోధకత. విమానం గాలిలోకి ఎగరాలంటే బరువు కన్నా లిఫ్ట్ అధికంగా ఉండాలి. డ్రాగ్ కన్నా థ్రస్ట్ అధికంగా ఉండాలి.

టేకాఫ్:

ఇంజన్లు థ్రస్ట్ ద్వారా విమానం వేగంగా ముందుకు కదలడంతో టేకాఫ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. విమానం వేగం పెరిగే కొద్ది గాలి రెక్కలపై నుంచి వేగంగా, కింద నుంచి నెమ్మదిగా వెళ్తుంది. దీంతో రెక్కల ఉపరితలంపై అల్ప పీడనం, రెక్కల కింద అధిక పీడనం ఏర్పడుతుంది. ఈ ప్రెజర్ డిఫరెన్స్ వల్ల బెర్నౌలి సూత్రం ఆధారంగా లిఫ్ట్ ఉత్పత్తి అవుతుంది. విమానం గాలిలోకి లేస్తుంది.

విమానం రొటేషన్ స్పీడ్ అని పిలువబడే వేగాన్ని చేరుకున్నప్పుడు, పైలట్ కంట్రోల్ కాలమ్ ను వెనక్కి లాగుతాడు, దీంతో ‘‘యాంగిల్ ఆఫ్ ఎటాక్’’ పెరుగుతుంది. ఇది రెక్కలు, గాలి మధ్య కోణాన్ని సూచిస్తుంది. ఈ చర్య వల్ల లిఫ్ట్ మరింతగా పెరుగుతుంది. దీని వల్ల విమానం ముక్కు భాగం ముందుగా పైకి వెళ్తుంది. ఒక్కసారి విమానం గాలిలోకి వెళ్లిన తర్వాత పైలట్ ల్యాండింగ్ గేర్‌‌ని, విస్తరించి ఉన్న రెక్కల్లోని ఫ్లాప్స్‌ని ఉపసంహరించుకుంటాడు. ఇంజన్లు క్రమంగా థ్రస్ట్ రూపంలో శక్తిని ఉత్పత్తి చేస్తూనే ఉండటంతో ఆకాశంలో వేగంగా ప్రయాణించడం సాధ్యమవుతుంది.

ఒక వేళ ఇంజన్లు సరైన శక్తిని ఉత్పత్తి చేయకున్నా, రెక్కల కాన్ఫిగరేషన్ సరైన స్థితిలో లేకున్నా విమానం స్టాల్ అనే ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు. ఫలితంగా విమానం కుప్పకూలుతుంది. ప్రస్తుతం ఎయిరిండియా విమాన ప్రమాదాన్ని చూసిన విశ్లేషకులు, ఇంజన్ ఫెయిల్యూర్ అని అనుమానిస్తున్నారు.

Exit mobile version