ఎయిరిండియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువ పైలట్ అర్మాన్ (28) గుండెపోటుతో మరణించాడు. బెంగళూరులో అర్మాన్ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయినట్లు ఎయిరిండియా వర్గాలు పేర్కొన్నాయి. ఆరోగ్య సమస్య కారణంగా సహోద్యోగిని కోల్పోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. తీవ్ర దు:ఖంలో ఉన్న కుటుంబానికి ఓదార్పు లభించాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఆ కుటుంబానికి సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ గోప్యతను గౌరవించాలని.. ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అర్మాన్‌కు ఇటీవలే వివాహం అయింది.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: పాకిస్తాన్తో కాంగ్రెస్కు సంబంధాలు ఉన్నాయి.. ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తుంది
తాజా ఘటనతో పైలట్ల పని గంటల గురించి మరోసారి చర్చ మొదలైంది. ఫిబ్రవరిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన ఒక నివేదికలో విమాన సిబ్బంది అలసటను తగ్గించడానికి పైలట్లు ఎప్పుడు, ఎంతసేపు విమానాలు నడపవచ్చనే దానిపై దశలవారీ రోడ్‌మ్యాప్‌ను నివేదించింది. జూలై 1, 2025 నుంచి పైలట్ల వారపు విశ్రాంతిని 36 నుంచి 48 గంటలకు పెంచాలని, నవంబర్ 1, 2025 నుంచి రాత్రిపూట విమాన ప్రయాణాన్ని తగ్గించాలని రోడ్‌మ్యాప్ ప్రతిపాదించింది. జూలై 1 నుంచి దశలవారీగా విశ్రాంతి సమయాలను కచ్చితంగా అమలు చేయాలని డీజీసీఏకు ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 24న ఆదేశించింది. త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: బీహెచ్ఈఎల్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు…
