Site icon NTV Telugu

India Pakistan: ‘‘నోటామ్’’ జారీ చేసిన భారత్.. పాక్ సరిహద్దుల్లో ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విన్యాసాలు..

India Pakistan

India Pakistan

India Pakistan: 26 మంది అమాయకుల్ని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే భారత్ దౌత్యపరంగా, ఆర్థికంగా పాకిస్తాన్ చుట్టూ ఉచ్చు బిగించింది. ఇక, సైనిక చర్యనే మిగిలి ఉందనే ఊహాగానాలు వినిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాజస్థాన్‌లో భారీ యుద్ధ విన్యాసాలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ‘‘నోటామ్(NOTAM)(నోటీస్ టూ ఎయిర్‌మెన్)’’ నోటీసుల్ని జారీ చేసింది.

Read Also: Sindhu river: పాకిస్తాన్‌కి మరో షాక్.. “సింధు నదుల”పై 6 ప్రాజెక్టుల పనులు వేగవంతం..

ఈ విన్యాసాలు బుధారం రాత్రి 9 గంటలకు ప్రారంభమై శుక్రవారం తెల్లవారుజామున 03 గంటలకు ముగుస్తాయి. ఈ సమయంలో సరిహద్దు దగ్గరగా ఉన్న విమానాశ్రయాల్లో్ వచ్చిపోయే విమానాలు నిలిపేయబడుతాయి. రాఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్ 30 సహా అన్ని కీలకమైన విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. ఈ ఎయిర్‌ఫోర్స్ ఎక్సర్‌సైజ్‌ని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు.

మరోవైపు, రేపు దేశవ్యాప్తంగా ‘‘మాక్ డ్రిల్’’ నిర్వహిస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ఎలా తమని తాము రక్షించుకోవాలనే దానిపై దేశవ్యాప్తంగా దాదాపుగా 300 ప్రదేశాల్లో ఈ ‘‘పౌరరక్షణ’’ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో, బోర్డర్‌లో ఎయిర్ ఫోర్స్ యుద్ధ విన్యాసాలు చేయడం గమనార్హం. భారత్‌లో చివరిసారిగా 1971లో పాక్‌తో యుద్ధ సమయంలో ఇలా మాక్ డ్రిల్స్ నిర్వించారు.

Exit mobile version