NTV Telugu Site icon

Air India: నెక్ట్స్ ఎమిరేట్స్ కావాలన్నదే ఎయిరిండియా లక్ష్యం.. అందుకే రికార్డ్ స్థాయిలో విమానాల కొనుగోలు..

Air India

Air India

Air India: ఎయిర్ ఇండియా డీల్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. ఏకంగా 470 కొత్త విమానాలకు ఆర్డర్ చేసి ప్రపంచ విమానయాన రంగంలోనే సంచలనం నమోదు చేసింది. ప్రభుత్వం నుంచి టాటా సంస్థ ఎయిరిండియాను చేజిక్కించుకున్న తర్వాత దాని రూపురేఖలే మారిపోనున్నాయి. ఎయిర్ బస్, బోయింగ్ ఈ రెండు సంస్థల నుంచి ఏకంగా 80 బిలియన్ డాలర్ల డీల్ తో ఎయిరిండియా 470 విమానాలను కొనుగోలు చేయనుంది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.6 లక్షల కోట్లకు పైమాటే. ఏవియేషన్ హిస్టరీలోనే ఇది భారీ డీల్.

ఫ్రాన్స్ సంస్థ ఎయిర్ బస్ నుంచి 250 విమానాలు, అమెరికా సంస్థ బోయింగ్ నుంచి 220 విమానాలను కొనుగోలు చేయనున్నారు. ఎయిర్ బస్ నుంచి 40 వైట్ బాడీ-ఏ 350 విమానాలు, 210 నేరో బాడీ-ఏ 320/321 నియో విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బోయింగ్ నుంచి పెద్ద విమానాలైన 20 బోయింగ్ 787-ఎస్, 10, 777 9ఎస్ తో 737 మ్యాక్స్ విమానాలు 190 కొనుగోలు చేసేందుకు ఎయిరిండియా ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై ఇటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్, బ్రిటన్ పీఎం రిషి సునాక్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ దేశాలకు భారత్ నుంచి ఈ డీల్ చాలా పెద్ద ఊరట.

Read Also: Naukri survey On IT Layoffs: ఈ ఏడాది ఫస్ట్ హాఫ్‌లో ఉద్యోగాల తొలగింపు తక్కువే.. వీరి ఉద్యోగాలు ఊడే అవకాశం..

చైనాను మించి భారత్ జనాభా పెరిగింది. ఏకంగా 140 కోట్ల ప్రజలు ఉన్న, రాబోయే కాలంలో ఎకనామిక్ సూపర్ పవర్ గా ఉన్న ఇండియాలో విమానయానం చాలా వరకు చాలా మందికి కలగానే ఉంది. ఇంత జనాభా ఉన్న భారత దేశంలోని ఏ విమానయాన సంస్థ కూడా టాప్-10 ఎయిర్ లైన్స్ జాబితాలో లేదు. ప్రస్తుతం దేశంలో కేవలం 700 విమానాలు మాత్రమే ఉన్నాయి. టాటా సంస్థ మాత్రం ఎయిరిండియాను ప్రపంచస్థాయి ఎయిర్ లైనర్ గా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో ఉంది. ఎయిరిండియాను గ్లోబల్ స్థాయి సంస్థగా తీర్చిదిద్దనున్నారు. మరో ఎమిరేట్స్ విమానయాన సంస్థగా మారాలని ఎయిర్ ఇండియా లక్ష్యంతో ఉంది.

ప్రస్తుతం ఏయిరిండియా వద్ద కేవలం 100కు మించి మాత్రమే విమానాలు ఉన్నాయి. గత దశాబ్ధం కాలంగా కొత్త విమానాలనే కొనుగోలు చేయలేదు. కానీ టాటాల చేతికి వచ్చిన తర్వాత ఏయిరిండియా అగ్రస్థానంలో నిలపాలని కోరుకుంటున్నారు. రానున్న కాలంలో ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతార్ ఎయిర్ వేస్ కు ధీటుగా ఎదగాలని ఎయిరిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఇక డొమెస్టిక్ గా కూడా విమానయాన సేవలు విస్తృతం కాబోయే అవకాశం ఉంది. గత ఎనిమిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా కేవలం 74 విమానాశ్రయాలు ఉంటే, ఇప్పుడు 147 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. రాబోయే 5 ఏళ్లలో 200కు మించి ఎయిర్ పోర్టులు రానున్నాయి. భారతదేశాన్ని ప్రపంచ స్థాయి కనెక్టింగ్ హబ్‌గా, అలాగే పర్యాటకులు మరియు వ్యాపారాలకు గమ్యస్థానంగా మార్చాలని కోరుతూ, విమానాశ్రయ విస్తరణను రెట్టింపు చేస్తూ సుదూర విమానాలను పెంచడానికి ప్రభుత్వం విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తోంది.