Site icon NTV Telugu

Congress: రేపటినుంచి అహ్మదాబాద్‌లో ఏఐసీసీ సమావేశాలు.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్!

Aicc

Aicc

రేపటి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళ, బుధవారాల్లో జరిగే సమావేశాల్లో.. మూలాల నుంచి పార్టీని పునరుద్ధరణ చేసే లక్ష్యంగా నేతలంతా సమాలోచనలు చేయనున్నారు. 64 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్‌లో సమావేశాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1938లో గుజరాత్‌లోని బర్దోలిలో, 1961లో భావనగర్‌లో ఏఐసీసీ సమావేశాలు జరిగాయి.

తాజా సమావేశాలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ, ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, ఏఐసీసీ కార్యనిర్వాహకవర్గ సభ్యులు, సీనియర్ నేతలంతా హాజరుకానున్నారు. ఇక తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ హాజరున్నారు.

దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్‌లో ఎదురయ్యే పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సమావేశాల్లో కార్యాచరణ రూపొందించనున్నారు. గతేడాది డిసెంబర్ 26, 27 తేదీల్లో కర్ణాటకలోని బెలగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో మహాత్మాగాంధీ జన్మించిన గుజరాత్‌లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రేపటి నుంచి అహ్మదాబాద్‌లో సమావేశాలు జరుగుతున్నాయి.

ఇది కూడా చదవండి: MP Mithun Reddy: నేడు సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ..

ఇదిలా ఉంటే త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలన్న లక్ష్యంతో వ్యూహ రచనలు చేయనున్నారు. ఆత్మ విశ్వాసంతో పార్టీ శ్రేణులను ఎలా పురికొల్పాలన్న లక్ష్యంగా సమాలోచనలు చేయనున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే ఢిల్లీలో రాష్ట్రాలవారీగా డీసీసీ అధ్యక్షుల సమావేశాలను అధిష్టానం వరుసగా నిర్వహించింది. ఈ ఏడాది చివరిలో బీహార్‌లో.. వచ్చే ఏడాది తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక 2027లో పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 2028లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అంతిమంగా 2029లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల్లో భవిష్యత్ కార్యాచరణపై తీవ్ర కసరత్తు చేయనున్నారు.

ఇది కూడా చదవండి: What Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Exit mobile version