Tamil Nadu Politics: వరుస ఎదురుదెబ్బలు.. అన్నాడీఎంకే నుంచి మరో ఎమ్మెల్యే ఔట్

Vijayabaskar Resigns

Vijayabaskar Resigns

Tamil Nadu Politics: తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సి. విజయభాస్కర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. విజయభాస్కర్ తన రాజీనామా పత్రాన్ని లిఖితపూర్వకంగా తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం. అప్పావుకు సమర్పించారు.. ఆయన రాజీనామాతో అన్నాడీఎంకేలో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో విరాలిమలై నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విజయభాస్కర్, పార్టీ కీలక నేతగా గుర్తింపు పొందారు. అంతకుముందు అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవలి కాలంలో అన్నాడీఎంకేలో అంతర్గత రాజకీయాలు, నాయకత్వ మార్పుల నేపథ్యంలో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో విజయభాస్కర్ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.

×
×
Ad

విజయభాస్కర్ రాజీనామాతో ఇప్పటివరకు అన్నాడీఎంకేకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసినట్లైంది. వరుస రాజీనామాలు పార్టీ భవిష్యత్ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే విజయభాస్కర్ రాజీనామాకు గల కారణాలపై ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. కాగా, అన్నా డీఎంకే నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోకుండా కట్టడి చేసేందుకు రెండుగా చీలిన గ్రూపులు ఏకమైనా.. ఈ రాజీనామాల పర్వాన్ని మాత్రం ఆపలేకపోతున్నాయి.. సీఎం విజయ్‌ శాసన సభలో తన బలాన్ని నిరూపించుకున్న తర్వాత ఎమ్మెల్యేల వరుస రాజీనామాలు.. ఆ తర్వాత టీవీకేలో చేరడం అన్నా డీఎంకేను కలవరపెడుతున్నాయి..