NTV Telugu Site icon

Agniveer: రాహుల్ గాంధీ వాదన తప్పు.. అగ్నివీర్‌పై ఆర్మీ కీలక ప్రకటన..

Rahul Gandhi

Rahul Gandhi

Agniveer: అగ్నివీరులకు ఇచ్చే పరిహారంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి కేంద్రం ఎలాంటి పరిహారం ఇవ్వలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే, దీనిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్‌ అజయ్‌కుమార్‌ కుటుంబానికి రూ.98 లక్షలు పరిహారంగా చెల్లించినట్లు భారత సైన్యం బుధవారం ప్రకటించింది. అజయ్ కుమార్ కుటుంబానికి ఎలాంటి పరిహారం అందలేదని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పేర్కొన్న నేపథ్యంలో ఆర్మీ ఈ ప్రకటన చేసింది.

‘‘విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ బంధువులకు ఎలాంటి పరిహారం చెల్లించలేదని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వచ్చాయి. చెల్లించాల్సిన మొత్తంలో ఇప్పటికే రూ. 98.39 లక్షలు చెల్లించారు’’ అని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘అగ్నివీర్ స్కీమ్ నిబంధనల ప్రకారం వర్తించే విధంగా సుమారు 67 లక్షల ఎక్స్-గ్రేషియా మరియు ఇతర ప్రయోజనాలు, పోలీసు వెరిఫికేషన్ తర్వాత త్వరలో తుది ఖాతా సెటిల్‌మెంట్‌పై చెల్లించబడతాయి. మొత్తం సుమారుగా రూ.1.65 కోట్ల పరిహారం అందిచబడుతుంది’’ అని చెప్పింది.

Read Also: Hemant Soren : జూలై 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న హేమంత్ సోరేన్.. మంత్రివర్గంలో మార్పు

అగ్నివీరులతో సహా మరణించిన ప్రతీ సైనికుడి కుటుంబానికి త్వరిగతిన పరిహారం చెల్లించబడుతుందని ఆర్మీ నొక్కి చెప్పింది. అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి చెల్లించిన పరిహారం విషయంలో రాజ్‌నాథ్ సింగ్ అబద్ధం చెప్పారని రాహుల్ గాంధీ తన ఎక్స్ పోస్టులో ఆరోపించిన కొద్ది సేపటికే ఆర్మీ నుంచి ఈ ప్రకటన వచ్చింది. సోమవారం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వం అగ్నివీరులను యూజ్ అండ్ త్రో కార్మికులుగా పరిగణిస్తోందని, వారికి అమరవీరుల హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. అయితే, రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన రక్షణ శాఖ మంత్రి అతను పార్లమెంట్‌ని తప్పుదోవ పట్టిస్తున్నారని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీరుడికి కోటి రూపాయల పరిహారం అందుతుందని పేర్కొన్నారు.

జూన్ 14, 2022న ప్రకటించబడిన అగ్నిపథ్ పథకం, 17 మరియు 21 సంవత్సరాల వయస్సు గల యువకులను కేవలం నాలుగు సంవత్సరాలకు మాత్రమే రిక్రూట్‌మెంట్ చేసుకుంటారు, వారిలో 25 శాతం మందిని మరో 15 సంవత్సరాల పాటు సైన్యంలో ఉంచుకునే నిబంధన ఉంది. ఆ ఏడాది తర్వాత ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పొడిగించింది.