BJP: ఇండియా కూటమి నేతలు పాకిస్తాన్ స్వరాన్ని వినిపిస్తున్నాయని బీజేపీ దుయ్యబట్టింది. అలాంటి ద్రోహుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సోమవారం బీజేపీ కోరింది. ఇండియా కూటమి నేతలు దేశప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించింది. ఇటీవల ఇండియా కూటమి పాకిస్తాన్‌కి మద్దతుగా మాట్లాడిన 5 సందర్భాలను బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ప్రస్తావించారు. తాజాగా ఈ రోజు జమ్మూ కాశ్మీర్ సీనియర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాన్ని పెంచాయి. భారత్ పీఓకేని స్వాధీనం చేసుకుంటుందనే విషయంపై మాట్లాడుతూ ‘‘పాకిస్తాన్ గాజులు తొడుక్కుని లేదు, వారి వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి’’ అని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళల్ని అవమానించడమే అని త్రివేది అన్నారు.
జమ్మూలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిపై ఉగ్రవాద దాడి ఎన్నికల స్టంట్ అని పంజాబ్ మాజీ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ వ్యాఖ్యానించడం, ముంబై దాడుల్లో అజ్మల్ కసబ్ ఐపీసఎస్ అధికారి హేమంత్ కర్కరేని చంపలేదని కాంగ్రెస్ నేత విజయ వాడెట్టివార్ చెప్పడం వంటి అంశాలను త్రివేది ఉహరించారు. భారత ప్రధాని నరేంద్రమోడీని విమర్శిస్తూ, పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ రాహుల్ గాంధీని పొడగటం, పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడటాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఇండియా కూటమి నేతలు పాక్ అనుకూల స్వరాన్ని వినిపిస్తున్నారని అన్నారు.
Read Also: Lok Sabha Elections 2024: యానిమేటెడ్ వీడియో వివాదం.. జేడీ నడ్డా, అమిత్ మాల్వీయాపై కేసు నమోదు..
నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమైనవిగా త్రివేది వర్ణించారు. జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను విశ్లేషిస్తూ, మోడీని విమర్శిస్తూ బంగ్లాదేశ్‌లోని ఓ వార్తాపత్రికకు కాంగ్రెస్ నేత శశిథరూరన్ కాలమ్ రాశారని అన్నారు. భారత్‌లో ఎన్నికలు జరుగుతుంటే బంగ్లాదేశ్ ప్రజాభిప్రాయాన్ని పెంచుతున్నారని త్రివేది మండిపడ్డారు. జమ్మూకాశ్మీర్‌ని కాంగ్రెస్ నాయకులు భారత పరిపాలనలో ఉన్న కాశ్మీర్ అని పేర్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముంబై ఉగ్రదాడుల గురించి కాంగ్రెస్ నాయకుడు పాకిస్తాన్‌కి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నాడని, మరొకరు అణ్వాయుధాల గురించి మాట్లాడుతుంటే, ఇంకొకరు జవాన్ల బలిదానాలను అనుమానిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ముస్లింలీగ్ ముద్ర ఉందని మోడీ చెప్పారని, వారు మాట్లాడే ప్రతీ మాటలో పాకిస్తాన్ వైఖరి కనిపిస్తోందని చెప్పారు. దేశంలో అణు నిల్వల్ని తొలగించాలని వామపక్షాలు కోరుకుంటున్నాయని త్రివేది అన్నారు. ఈ నాయకులు ఎవరి చేతిలో ఉన్నారని ప్రశ్నిస్తూ, ద్రోహుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.