NTV Telugu Site icon

Maharashtra: నాందేడ్ ఘటన మరవక ముందే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కరోజులో 23 మంది మృతి

Nagpur

Nagpur

Maharashtra: మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణమృదంగం మోగుతూనే ఉంది. పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు పిల్లల్లా రాలిపోతున్నారు. నాందేడ్ ఆస్పత్రి ఘటన జరిగి ఒక రోజు గడవక ముందే మరో రెండు ఆస్పత్రుల్లో పేషెంట్లు చనిపోయారు. నాగ్‌పూర్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్)లో 24 గంటల్లో 14 మంది మరణించారు. ఇదే సమయంలో నగరంలోని మరో ప్రభుత్వ ఆస్పత్రిలో మరో 9 మంది మరణాలు సంభవించినట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 30-అక్టోబర్ 2 మధ్య నాందేడ్ లోని శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రిలో 48 గంటల్లో 31 మంది రోగులు మరణించడం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఛత్రపతి సంభాజీనగర్ ఆస్పత్రిలో 24 గంల వ్యవధిలో 18 మరణాలు నమోదయ్యాయి.

Read Also: NewsClick: చైనాతో న్యూస్‌క్లిక్ న్యూస్ పోర్టల్‌కి సంబంధం.. అమెరికా కీలక వ్యాఖ్యలు..

బుధవారం ఉదయం 8 గంటల వరకు నాగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లో 14 మంది మరణించారని, ఆస్పత్రిలో 1900 పడకల సామర్థ్యం ఉందని, రోజూ సగటున 10 నుంచి 12 మంది రోగులు మరణిస్తారని జీఎంసీహెచ్ డీన్ డాక్టర్ రాజ్ గబ్జియే తెలిపారు. ఆస్పత్రిలో మరణించిన రోగుల్లో ఎక్కువగా చివరి నిమిషాల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో అడ్మిట్ అయిన వారే అని.. అటువంటి రోగుల్ని ప్రాణాపాయ స్థితిలో జీఎంసీహెచ్‌కి తీసుకువస్తారని ఆయన చెప్పారు. విదర్భ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల రోగులు నాగ్‌పూర్ లో ఉన్న ఈ ఆస్పత్రికి వస్తారని, మరణించిన రోగుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నవారే అని, వీరిలో వెంటిలేటర్ సపోర్టు ఉన్న రోగులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.

అంతకుముందు నాందేడ్ లో జరిగిన మరణాల్లో 31 మందిలో 16 మంది పిల్లలు ఉన్నారు. మందులు, సిబ్బంది లోటు ఉండటంతోనే మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే మహరాష్ట్ర శివసేన(ఏక్ నాథ్ షిండే), బీజేపీ, ఎన్సీపీ( అజిల్ పవార్) ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.