Site icon NTV Telugu

INDIA bloc: ఇండియా కూటమిలో లుకలుకలు.. కాంగ్రెస్‌పై అఖిలేష్ యాదవ్ విమర్శలు..

Akhilesh Yadav

Akhilesh Yadav

INDIA bloc: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, ఆర్జేడీ, శివసేన(ఉద్ధవ్), జేడీయూ, ఆప్, సమజ్ వాదీ(ఎస్పీ) పార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమిని కట్టాయి. అయితే ఇప్పటికే ఈ కూటమికి సంబంధించి మూడు సమావేశాలు జరిగాయి. సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం కూటమి తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు.

తాజాగా ఇండియా కూటమికి బదులుగా ‘పీడీఏ’ అస్త్రాన్ని బయటకు తీశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి ఆరు సీట్లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్, ఆ మేరకు హామీని నిలబెట్టుకోలేదని అఖిలేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంతో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి.

Read Also: Allu Arjun: ఇద్దరు పోరంబోకులకు నేషనల్ అవార్డు వచ్చింది..

తాజాగా ఆయన ఎక్స్(ట్విట్టర్)లో పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఎస్పీ కార్యకర్త ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘‘మిషన్ 2024 నేతాజా(ములాయం సింగ్ యాదవ్) అజరామరంగా ఉండనివ్వండి. ‘పీడీఏ’ ఈసారి ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ ని గెలిపించేలా చేస్తుంది. అఖిలేష్ యాదవ్ పేదలకు న్యాయం జరిగేలా చూస్తారు’’ అంటూ ట్వీట్ చేశారు. పీడీఏ అంటే వెనకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు అని అర్థం. మధ్యప్రదేశ్ ఎన్నికల అభ్యర్థుల లిస్టును కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత ఇతర పార్టీలను కాంగ్రెస్ ఫూల్ చేస్తోందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.

రాష్ట్రంలో పొత్తులేదని తెలిస్తే మేం కాంగ్రెస్ వాళ్లతో కలిసేవాళ్లం కాదని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ ఈ వివాదాన్ని వదిలేయాలని కోరారు. ఇండియా కూటమి కేంద్ర స్థాయిలో ఉందని అన్నారు. కాంగ్రెస్, ఎస్పీకి ద్రోహం చేయవద్దని, పొత్తు కావాలా..? వద్దా..? అనేది స్పష్టం చేయాలని కోరింది. గతంలో కులగణన లెక్కలు చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కులగణనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని అఖిలేష్ యాదవ్ అన్నారు.

Exit mobile version