NTV Telugu Site icon

Kargil War: కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ పాత్ర.. తొలిసారి అంగీకరించిన దాయాది దేశం..

Kargil War

Kargil War

Kargil War: 1999లో భారత్‌పై పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదుల ముసుగులో కార్గిల్ యుద్ధానికి తెరలేపింది. అయితే, ఈ యుద్ధం జరిగి ఇప్పటికి 25 ఏళ్లు గడిచినా ఇందులో పాకిస్తాన్ ఆర్మీ తన ప్రేమేయం గురించి ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. ఈ యుద్ధం వెనక కర్త,కర్మ,క్రియ అంతా పాకిస్తాన్ ఆర్మీ అనేది బహిరంగ రహస్యమే అయినా, ఎప్పుడు కూడా తన పాత్రను అంగీకరించలేదు. ఇదిలా ఉంటే, తొలిసారిగా పాకిస్తాన్ ఈ యుద్ధంతో తమ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసింది.

శుక్రవారం రోజు పాకిస్తాన్ డిఫెన్స్ డే సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మాట్లాడుతూ.. కార్గిల్ యుద్ధంలో తమ పాత్ర ఉందనేలా వ్యాఖ్యలు చేశారు. ‘‘1948, 1965, 1971, మరియు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధాలు, అలాగే సియాచిన్‌లో, ఈ ఘర్షణలలో వేలాది మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు” అని అన్నారు. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో చేసిన ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Divvala Madhuri vs Duvvada Vani: దువ్వాడ వాణికి షాకిచ్చిన దివ్వెల మాధురి..! ఈ ఇల్లు నాది.. ఏమైనా ఉంటే బయట చూసుకో..

పాకిస్తాన్ చేసిన పన్నాగాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ‘‘ఆపరేషన్ విజయ్’’ పేరుతో పాకిస్తాన్ ఆక్రమించుకున్న అన్ని ప్రాంతాలను చేజిక్కించుకుంది. వ్యూహాత్మక పోస్టుల్లో తిష్ట వేసిన పాక్ దళాలను, చొరబాటుదారుల్ని అంతం చేసింది.

గతంలో పాకిస్తాన్ పలుమార్లు కార్గిల్ యుద్ధంతో తమ ఆర్మీ ప్రమేయం లేదని బుకాయిస్తూ వస్తోంది. చొరబాటుదారుల్ని, ఉగ్రవాదుల్ని ‘‘కాశ్మీరీ స్వాతంత్య్ర సమరయోధులు’’, ‘‘ముజాహీదిన్’’గా అభివర్ణించింది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పలువురు జర్నలిస్టుల ఆనాటి ఫోటోలను షేర్ చేస్తున్నారు. యుద్ధంలో మరణించిన వారి మృతదేహాలను తీసుకునేందుకు పాకిస్తాన్ సైన్యం నిరాకరించడాన్ని వారు అక్కడి జర్నలిస్టులు ప్రశ్నించారు.

కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ ఈ యుద్ధాని ‘‘బ్లండర్’’ అభివర్ణించారు. లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) షాహిద్ అజీజ్ కూడా తన సైనిక విరమణ తర్వాత కార్గిల్‌లో తమ దళాల పాత్రను అంగీకరించారు. అజీజ్ ఆపరేషన్ “ఫోర్-మ్యాన్ షో”గా అభివర్ణించారు, ఇది జనరల్ పర్వేజ్ ముషారఫ్ మరియు మరికొందరు టాప్ కమాండర్లకు మాత్రమే తెలుసు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి 1999లో లాహోర్ డిక్లరేషన్‌పై సంతకం చేసిన నవాజ్ షరీఫ్ ఆ తర్వాత కార్గిల్ చర్య ద్వారా పాక్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు.

Show comments