Site icon NTV Telugu

Tiger: 110 ఏళ్ల తరువాత ఆ రాష్ట్రంలో కనిపించిన పులి..

Tiger In Haryana

Tiger In Haryana

Tiger spotted in Haryana after 110 years: దాదాపుగా 110 ఏళ్ల తర్వాత హర్యానాలో పులి కనిపించింది. చివరి సారిగా 1913లో పులి కనిపించినట్లు రాష్ట్ర అటవీ, వన్యప్రాణి మంత్రి కన్వర్ పాల్ చెప్పారు. హర్యానాలోని యమునానగర్ జిల్లాలోని కలేసర్ నేషనల్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులికి సంబంధించిన ఫోటోలు చిక్కాయని అధికారులు వెల్లడించారు. 110 సంవత్సరాల తర్వాత కలేసర్ ప్రాంతంలో పులి కనిపించడం రాష్ట్రానికి గర్వకారణం మంత్రి అన్నారు. అడవులు మరియు వన్యప్రాణులు మన సహజ వారసత్వం మరియు వాటిని రక్షించడానికి మనం ఐక్యంగా కృషి చేయాలని చెప్పారు.

Read Also: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో వ్యక్తి పాడు పని.. పోలీసులకు నోటీసులు

ఏప్రిల్18, 19 తేదీల్లో పులి కనిపించింది. పులి వయస్సు, ఆడా..? మగా..? అని నిర్థారించేందుకు ప్లగ్ మార్క్ లను పరిశీలించేందుకు ఓ టీం ను ఏర్పాటు చేసినట్లు పంచకుల చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎంఎల్ రాజ్ వంశీ చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని రాజాజీ నేషనల్ పార్క్ నుండి పులి కాలేసర్‌కు చేరుకుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. హర్యానాలోని కలేసర్ పార్క్, హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలోని సింబల్బరా నేషనల్ పార్క్ను అనుకుని ఉంది. ఈ రెండు నేషనల్ పార్కులు దట్టమైన అటవీ ప్రాంతంతో రాజాజీ నేషనల్ పార్క్‌కి కలపబడి ఉన్నాయి. పులులు తిరిగేందుకు ఈ కారిడార్ అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు.

ప్రస్తుతం హర్యానా కలేసర్ అటవీ ప్రాంతాన్ని చేరుకున్న పులి ఈ అటవీ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుంటుదని భావిస్తున్నారు అధికారులు. శివాలిక్ పర్వత ప్రాంతాల్లో 11,570 ఎకరాల్లో కలేసర్ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ నేషనల్ పార్క్ చిరుతలు, ఏనుగులు, అడవి పందులు, సాంబార్లకు అనేక జాతుల పక్షులకు నిలయంగా ఉంది. ఫిబ్రవరి నెలలో రాజాజీ నేషనల్ పార్క్ నుండి రెండు ఏనుగులు కాలేసర్‌కు వచ్చినట్లు సమాచారం.

Exit mobile version