ఒకప్పుడు ఎకరాల్లో కొనేవారు.. ఇప్పుడు గజాల్లో కొనుగోలు చేసేందుకే ఇబ్బంది పడుతున్నారు.. ఎస్‌ఎఫ్‌టీల్లో కొని సంబరపడాల్సిన పరిణామాలు వచ్చాయి.. అయితే, తెలుగు, తమిళ సినిమాల్లో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి వాణిశ్రీ భూమి కబ్జాకు గురైంది.. దాదాపు 11 ఏళ్ల క్రితం వాణిశ్రీ భూమిని కొందరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.. ఆ భూమి విలువ ప్రస్తుత మార్కెట్‌లో రూ.20 కోట్లకు పై మాటేనటి.. అయితే, నకిలీ పత్రాలతో జరిగిన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి.. ఆ భూమిని తిరిగి వాణిశ్రీకి అందించింది తమిళనాడు ప్రభుత్వం.. సీఎం స్టాలిన్ స్వయంగా.. ఆ భూమి పత్రాలను వాణిశ్రీకి అందించారు.. మొత్తం ఐదుగురి భూములను కబ్జాదారుల చెర నుంచి ఆ భూమిని కాపాడి.. తిరిగి యజమానులకు అందించారు. వారిలో ఒకరు వాణిశ్రీ.. ఇక, తిరిగి తన భూమి తనకు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు.
సీఎం స్టాలిన్ చేతుల మీదుగా సంబంధిత భూమి పత్రాలు అందుకున్న వాణిశ్రీ… ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రూ. 20 కోట్ల విలువైన తన భూమిని ఫేక్ సర్టిఫికెట్లతో కబ్జా చేశారు.. దీనిపై ఎంతో మందికి మొరపెట్టుకున్నాను.. ఎందరినో కలిశాను.. తాను 11 ఏళ్లుగా తిరిగి తిరిగి అలసిపోయానని, ఇకపై ఆ భూమిపై పైసా కూడా ఖర్చు పెట్టకూడదనే నిర్ణానికి వచ్చాను.. కానీ, ముఖ్యమంత్రి స్టాలిన్ కల్పించుకుని.. తన భూమిని తిరిగి ఇప్పించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు.. ఆయన చల్లగా ఉండాలని, మంచి పాలన అందిస్తూనే ఉండాలని ఆకాంక్షించారు సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ..
వాణిశ్రీ సహా ఐదుగురికి సంబంధించిన భూమిని కొందరు కబ్జా పెట్టారు.. అంతేకాదు నకిలీ పత్రాలు సృష్టించారు.. తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.. ఆ తర్వాత ఆ భూమిని విక్రయించే ప్రయత్నం చేశారు.. అసలు యజమానులకు ఈ విషయం తెలిసే.. అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.. తమకు జరిగిన మోసం గురించి అధికారులను ఆశ్రయించారు. సుదీర్ఘకాలం వారి పోరాటం కొనసాగింది.. ఇక, ఆశలు కూడా వదులుకున్నారు.. ఈ క్రమంలో భూకబ్జాలకు సంబంధించి 2021, సెప్టెంబర్‌లో తమిళనాడు శాసనసభ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.. 1908లో అమలులోకి తెచ్చిన చట్టాన్ని సవరించడానికి సీఎం స్టాలిన్ నేతృత్వంలోని సర్కార్ తీసుకొచ్చిన ఆ కొత్త చట్టం ప్రకారం నకిలీ పత్రాలు, వ్యక్తుల ద్వారా అక్రమంగా వేరే వారికి చెందిన భూమిని రిజిస్ట్రేషన్ చేస్తే.. దానిని రద్దు చేసే అధికారాన్ని ఆ శాఖకు కల్పించింది ప్రభుత్వం.. ఆ బిల్లుకు 2022 ఆగస్టు 6న రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది.. దీంతో, వాణిశ్రీకి చెందిన 20 కోట్ల విలువైన స్థలానికి కబ్జాదారుల చెర నుంచి విముక్తి లభించింది.