Site icon NTV Telugu

Govinda: ఏక్‌నాథ్ షిండేని కలిసిన బాలీవుడ్ స్టార్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..?

Govinda

Govinda

Govinda: ప్రముఖ బాలీవుడ్ స్టార్ గోవింద 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో ఆయన భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. ఆయన శివసేనలో చేరే అవకాశం ఉంది. శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) అభ్యర్థి అమోల్ కీర్తికర్‌‌కి పోటీగా శివసేన(ఏక్‌నాథ్ షిండే) పార్టీ నుంచి నార్త్-వెస్ట్ ముంబై నుంచి పోటీకి దిగుతారని సమాచారం. ఒకే వారంలో షిండేతో గోవింద భేటీ కావడం ఇది రెండో సారి. బుధవారం రోజు షిండే క్యాంపు అధికార ప్రతినిధి కృ‌ష్ణ హెగ్డేని ఆయన నివాసంలో కలిశారు.

Read Also: Arvind Kejriwal Arrest: భారత్ హెచ్చరికతో మారిన జర్మనీ స్వరం..

2004 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపు గోవింద ముంబై నార్త్ నుంచి పోటీ చేసి, బీజేపీ సీనియర్ నేత రామ్ నాయక్‌పై విజయం సాధించారు. అయితే, 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 మరియు మే 20 మధ్య ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మహారాష్ట్రలో అధికార బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్)ల మహాయుతి కూటమి, కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్)-ఎన్సీపీ(శరద్ పవార్)ల మహావికాస్ అఘాడీ కూటముల మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు కూటముల్లో సీట్ల షేరింగ్‌పై చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల కాంగ్రెస్ కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. శివసేన(ఉద్ధవ్) 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Exit mobile version