Delhi Car Blast: ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరిగింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట వద్ద కారు బాంబ్ దాడి జరగడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ‘‘ఆపరేషన్ సిందూర్’’ మళ్లీ మొదలైనట్లు పలువురు చెబుతున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉగ్రవాదులకు సంబంధించిన కీలక వివరాలు బయటకు వచ్చాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తు తర్వాత తేలినట్లు సమాచారం. పహల్గామ్ దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’పేరుతో భారీగా దాడులు చేసిన సంగతి తెలిసింది. చివరకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణను కోరింది.
Read Also: Delhi Car Blast: ఢిల్లీ కార్ బ్లాస్ట్.. భారత్‌కు ఇజ్రాయిల్ సంఘీభావం..
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత నేలపై ఏ ఉగ్రవాద ఘటన జరిగిన దానిని ‘‘యాక్ట్ ఆఫ్ వార్’’(యుద్ధ చర్య)గా పరిగణిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు ఢిల్లీ పేలుడు ఘటన కూడా ఉగ్రవాద చర్య అని స్పష్టమవుతోంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేలుడుకు బాధ్యులైన వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై ప్రముఖ దర్యాప్తు సంస్థలు వేగంగా దర్యాప్తు జరుపుతున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. ఈ విషాదానికి కారణమైన వారిని కోర్టు ముందు నిలబెడుతామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలి పెట్టబోమని హామీ ఇచ్చారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా నివాసి ఉమర్ మొహమ్మద్ పేలుడు వెనుక ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇతనే పేలుడు పదార్థాలు ఉన్న కారులో ఉన్నట్లు సీసీటీవీ కెమెరాల్లో కనిపిస్తోంది. ఈ ఉగ్రవాద మాడ్యూల్‌లో మరో ఇద్దరు డాక్టర్లు- ముజమ్మిల్ షకీల్, ఆదిల్ రాథర్‌లను అధికారులు అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన ఉమర్ టెలిగ్రామ్ ద్వారా పాకిస్తాన్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పేలుడుకు ముందు ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. దీంతోనే ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు అనుమానిస్తున్నారు.
