Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ తమ ప్రాంతమని డ్రాగన్ కంట్రీ చైనా చెబుతోంది. అయితే, ఎప్పటికప్పుడు చైనా వాదనల్ని భారత్ తిప్పికొడుతోంది. తాజాగా మరోసారి ఇండియాపై చైనా తన అక్కసు వెళ్లగక్కింది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరుణాచల్‌పై చేసిన వాదనల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. ‘‘ అరుణాచల్ భారతదేశంలో అంతర్భాగం, విడదీయలేని భాగం’’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ రోజు అధికార ప్రకటన విడుదల చేసింది. ‘‘భారత్ రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై చైనా రక్షణ మంత్రిశాఖ ప్రతినిధి అసంబద్ధమైన వాదనల్ని మేము గుర్తించాము. ఈ విషయంపై నిరాధారమైన వాదనలను పునరావృతం చేయడం ద్వారా ఎటువంటి చెల్లుబాటు ఇవ్వదు’’ అని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. అరుణాచల్ ప్రజలు మా అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల నుంచి ప్రయోజనం పొందుతూనే ఉంటారు అని స్పష్టం చేశారు.
Read Also: Vinay Kumar: రష్యాకు భారత రాయబారిగా వినయ్ కుమార్ నియామకం..
చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తమదిగా చెప్పుకుంది. అ ప్రాంతాన్ని జాంగ్నాన్ ప్రాంతంగా పేర్కొంటోంది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ జియోగాంగ్ మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతం భారతదేశం చేత చట్టవిరుద్ధంగా స్థాపించబడింది, చైనా దీనిని ఎప్పుడూ గుర్తించదు అని అన్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఆయన పర్యటన తర్వాత చైనా ఇలా వ్యాఖ్యలు చేస్తో్ంది. గతంలో కూడా పలువురు నేతలు ఆ రాష్ట్రంలో పర్యటించిన తర్వాత చైనా ఇలాగే గగ్గోలు పెట్టింది. మార్చి 9న, మోడీ ప్రపంచంలోనే అతి పొడవైన టూ-లైన్ టన్నెల్ ‘సెలా టన్నెల్’ని ప్రారంభించింది. ఇది ఉత్తరాన చైనాతో సరిహద్దు పంచుకుంటున్న తవాంగ్ ప్రాంతానికి అన్ని వాతావరణ పరిస్థితుల్లో మెరుగైన రవాణా అందిస్తుంది. ఫలితంగా మన ఆర్మీ దళాల మోహరింపు, తరలింపుకు, మెరుగైన కదలికలకు టన్నెల్ ఉపకరిస్తుంది. రూ.825 కోట్లతో నిర్మించిన ఈ టన్నెల్‌తో చైనా భయపడుతోంది.