Cockroach Janta Party: ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ ఆందోళనల్లో ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీక్, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయితే, తమ నిరసన టైమ్ పొడగించాలని సీజేపీ డిమాండ్‌ను పోలీసులు తిరస్కరించారు. దీంతో నిరసనకారుల్ని పోలీసులు ఆ ప్రదేశం నుంచి శాంతియుతంగా తొలగించడంతో ఉద్రిక్తత మొదలైంది. సాయంత్రం 6 గంటలకు కూడా మద్దతుదారులు పెద్ద సంఖ్యలో చేరాలని సీజేపీ పిలుపునిచ్చింది. అయితే, ఢిల్లీ పోలీసులు మాత్రం గడవు ముగిసిందని, నిరసనకారులు ప్రదేశాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు.
జంతర్ మంతర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ఎస్ఎఫ్ఐకి చెందిన పలువురు విద్యార్థి నాయకులు ఇంకా వేదికపైనే ఉన్నారు. దీనికి ముందు జనాలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన దీప్కే.. శాంతియుత నిరసనకు అనుమతి పొడగించాలని ఢిల్లీ పోలీసుల్ని కోరారు. ‘‘ చర్చలకు మేం సిద్ధం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలనేది మా డిమాండ్. బలవంతంగా మమ్మల్ని తొలగించడానికి పోలీసులు అరెస్ట్‌లు చేస్తే, అరెస్ట్ అయ్యే వారిలో నేనే మొదటి వ్యక్తిని అవుతానున’’ అని దీప్కే అన్నారు.

