NTV Telugu Site icon

Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఏప్రిల్ 7న ఆప్ నిరాహార దీక్ష

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఏప్రిల్ 7న జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్షకు ప్రారంభిస్తుందని ఆ పార్టీ నేత గోపాల్ రాయ్ బుధవారం తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టుకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆప్ జాతీయ కన్వీనర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మార్చి 21న అరెస్టు చేసింది. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Read Also: Lok Sabha Elections 2024: “నితీష్ నుంచి అప్నాదళ్ వరకు”.. ఇండియా కూటమిని వదిలివెళ్లిన పార్టీలు ఇవే..

ఆప్‌ని అంతం చేయాలనే కుట్రలోనే కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసినట్లు రాయ్ ఆరోపించారు. ఏప్రిల్ 7న ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ఆఫీస్ బేరర్లు జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తారని, ఇది బహిరంగ కార్యక్రమం అని, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, వ్యాపారులు వచ్చి పాల్గొనవచ్చని తెలిపారు.

ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ‘కింగ్‌పిన్’గా ఉన్నారంటూ ఈడీ చెబుతోంది. ఇప్పటికే ఈ లిక్కర్ కేసులో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జైలుకు వెళ్లగా.. సంజయ్ సింగ్ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. మరోవైపు ప్రతిపక్షాలను వేధించేందుకే కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈడీ, ఐటీ, సీబీఐల ద్వారా నేతల్ని టార్గెట్ చేస్తున్నారని బీజేపీపై మండిపడుతున్నారు.