Site icon NTV Telugu

AAP: ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. బీజేపీ గూటికి ఢిల్లీ కౌన్సిలర్..

Delhi Elections

Delhi Elections

AAP councillor Pawan Sehrawat joins BJP: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ కు చెందిన కౌన్సిలర్ పవన్ సెహ్రావత్ బీజేపీలో చేరారు. శుక్రవారం ఆయన బీజేపీ గూటికి చేరారు. సెహ్రావత్ బవానా వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నిమిషాల ముందు ఈ ప్రకటన వెలువడింది. బీజేపీలోకి చేరిన తర్వాత ఆప్ పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) సభలో గందరగోళం సృష్టించేందుకు తనపై ఒత్తిడి తెచ్చారని సెహ్రావత్ ఆరోపించారు. ఆప్ రాజకీయాలు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆయన అన్నారు.

Read Also: Bengaluru: బెంగళూర్ నగరంలో అక్రమంగా 600 మంది విదేశీయులు తిష్ట..

ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు మేరకు బుధవారం ఆప్ పార్టీకి చెందిన షెల్లీ ఓబెరాయ్ మేయర్ గా ఎన్నికయ్యారు. 15 ఏళ్ల తరువాత బీజేపీ ఢిల్లీ కార్పొరేషన్ పై తన పట్టు కోల్పోయింది. ఇదిలా ఉంటే కొత్త మేయర్ ఎన్నిక తర్వాత ఆప్, బీజేపీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడులు చేసున్నారు. బుధవారం రాత్రంతా ఎంసీడీ హాల్ లోనే బీజేపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఈ గొడవల్లో హాల్ లోని కుర్చీలు, మైకులు, పోడియం విరిగిపోయాయి. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు సభ వాయిదా పడింది. ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికపై గందరగోళం మరియు నినాదాలు కొనసాగడంతో మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ సభ గురువారం రోజంతా వాయిదా పడింది.

ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ స్టాండింగ్ కమిటీ ఓటింగ్‌లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని అనుమతించారు. బ్యాలెట్‌ గోప్యతకు భంగం వాటిల్లుతుందని, మొబైల్‌ వినియోగంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ గందరగోళం మధ్యే ఓటింగ్ కొనసాగింది. ఇదిలా ఉంటే తాజాగా ఆప్ పార్టీకి చెందిన కౌన్సిలర్ బీజేపీలోకి మారడంతో రాజకీయం రసవత్తంగా మారుతోంది.

Exit mobile version