NTV Telugu Site icon

Arvind Kejriwal: ఇండియా కూటమి నుంచి వైదొలగబోం.. త్వరలోనే సీట్ల పంపకాలు..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. 2015 మాదకద్రవ్యాల కేసులో పంజాబ్‌కి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను ఆప్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆప్ ప్రభుత్వం తమపై రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతోందని పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ ఆరోపించింది. అయితే అతనిపై చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని ఆప్ విమర్శలను తోసిపుచ్చింది. మరోవైపు ఇరు పార్టీలు కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ పరిణామాల నేపథ్యంలో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని శుక్రవారం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఇండియా కూటమి నుంచి ఆప్ వైదొలగబోదని, కూటమి ధర్మాన్ని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. సీట్ల పంపకాల ఫార్ములాపై త్వరలోనే సిద్ధమవుతుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also: Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీద్ కమిటీకి ఎదురుదెబ్బ.. సర్వే ఆపేది లేదని స్పష్టం చేసిన కోర్టు..

ఇండియా కూటమి ఇప్పటి వరకు ప్రధాని అభ్యర్థి ఎవరన్నది నిర్థారించలేదని మీడియా ప్రశ్నించగా.. ప్రతీ పౌరుడిని శక్తివంతం చేయడమే మా లక్ష్యం అని, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు తమ ప్రధాని అనుకునేలా వ్యవస్థను రూపొందించడం మా లక్ష్యమని అన్నారు. ఏ ఒక్కరికీ అధికారం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.

సుఖ్‌పాల్ సింగ్ అరెస్టుపై కేజ్రీవాల్ మాట్లాడారు. అతడిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారని విన్నానని, అయితే తన వద్ద సమాచారం లేదని, మీరు పంజాబ్ పోలీసులతో మాట్లాడాలని అన్నారు. అయితే పంజాబ్ లోని భగవంత్ మాన్ సర్కార్ రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడానికి కట్టుబడి ఉందని, ఎవరిని విడిచిపెట్టదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.