Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే ముంబై నివాసంలో ‘‘శివతీర్థ’’లో కలిశారు. అమీర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్ను భారతదేశం విడిచి వెళ్లాలని ముంబై పోలీసులు నోటీసులు జారీ చేసిన వేళ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఈ భేటీ ఎజెండా ఏమిటో ఇరు వర్గాలు ప్రకటించలేదు. అమీర్ ఖాన్తో పాటు ఆయన భార్య గౌరీ స్ప్రాట్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఇమ్రాన్ ఖాన్ వివాదం వేళ ఈ కలయిక రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. అక్టోబర్ 10న ముంబైలోని ఆగస్ట్ క్రాంతి మైదాన్లో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా నిరసన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంబై పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత, అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్ను అక్టోబర్ 28లోగా భారత్ విడిచిపెట్టి వెళ్లాలని ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ వ్యవహారంపై ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

