NTV Telugu Site icon

Viral Video: పింఛన్ కోసం వృద్ధురాలి పాట్లు.. ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా ఒంటి కాలితో నడక..

Odisha

Odisha

70-Year-Old Forced To Walk Barefoot To Collect Pension From Bank: వృద్ధులకు ప్రభుత్వం ఇచ్చే పింఛనే ఆసరా. ప్రభుత్వం ఇచ్చే రెండు మూడు వేలను నెలంతా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. అదే సమయంలో పింఛన్ సరైన సమయంలో రాకుంటే వారి బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. చాలా కుటుంబాల్లో కన్నవాళ్లు వృద్ధులైన తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోవడంతో ఈ పింఛనే ఆధారంగా ఉంటోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పింఛన్ కోసం పడుతున్న పాట్లు పలువురితో కంటతడిపెట్టిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Read Also: Poonch Attack: పూంచ్ ఉగ్రదాడి పాకిస్తాన్ కుట్రేనా..? కాశ్మీర్ లో జీ20 సమావేశాలే కారణమా.. భారత్ ప్రతీకారం ఎలా ఉండబోతోంది..?

ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో తన వృద్ధాప్య పింఛను కోసం 70 ఏళ్ల వృద్ధురాలు చెప్పులు లేకుండా కొన్ని కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన హృదయవిదారకంగా ఉంది. జిల్లాలోని ఝరిగావ్ బ్లాక్ బానూగూడ గ్రామానికి చెందిన సూర్య హరిజన్ అనే మహిళ విరిగిన కుర్చీని ఆసరాగా చేసుకుని ఎండవేడిలో చెప్పులు లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిరుపేదలకు సాయం చేయడానికి ప్రభుత్వ పథకాలు అమలులో ఉన్నప్పటికీ, సూర్య మహాజన్ కు వివిధ కారణాల వల్ల అందడం లేదు.

సూర్య హరిజన్ పెద్ద కొడుకు వలసకూలీగా వేరే రాష్ట్రానికి వెళ్లగా.. మరో కొడుకు పశువులను మేపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. చిన్న గుడిసెలో కాలం వెళ్లదీస్తున్నారు. గతంలో వృద్ధురాలికి పింఛన్ డబ్బులు చేతికి అందేవి, కానీ ప్రస్తుతం ఆమె బ్యాంక్ ఖాతాలో పింఛన్ డబ్బులు పడుతున్నాయి. ఇదిలా ఉంటే ఆమె ఎడమ చేయి బొటన వేలిముద్ర కొన్ని సార్లు సరిపోవడం లేదు, దీంతో పింఛన్ డబ్బులు చెల్లించడం సమస్యగా మారుతోందని సదరు బ్యాంక్ చెబుతోంది. 4 నెలలుగా ఆమెకు పింఛన్ అందలేదని, దీంతో ఆమె బ్యాంకు వెళ్లాల్సి రావడంతో ఇలా కుర్చీనే చేతికర్రగా ఉపయోగించుకుని ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా ప్రయాణించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో అధికార యంత్రాంగం దిగివచ్చింది. ఆమెకు ఇంటికే పింఛన్ పంపిస్తామని, ఆమెకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.