NTV Telugu Site icon

Maha Kumba Mela: ఎన్ని కోట్ల మంది స్నానాలు చేశారు.. ఎంత ఆదాయం వచ్చింది.. వివరాలు ఇవే!

Maha Kumba Mela

Maha Kumba Mela

మహా కుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు 45 రోజుల పాటు మహా కుంభమేళా జరిగింది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో కుంభమేళా గ్రాండ్‌గా ముగిసింది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అంతేకాకుండా కోట్లలో బిజినెస్ కూడా నడిచింది. ఇందుకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగంలో దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇక రూ.3 లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు నడిచాయని పేర్కొంది. పరోక్షంగా.. ప్రత్యక్షంగా 60 లక్షల మంది జీవనోపాధి పొందినట్లుగా వెల్లడించింది. దాదాపు 150 కి.మీ మేర వ్యాపారాలు జరిగాయని పేర్కొంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద మతపరమైన పండుగ ఇదేనని పరమార్థ నికేతన్ అధ్యక్షుడు స్వామి చిదానంద సరస్వతి తెలిపారు. ప్రయాగ్‌రాజ్ ఒక చరిత్ర సృష్టించిందని చెప్పారు.

యాత్రికులకు ఆర్థిక సౌలభ్యం కల్పించడానికి 16 బ్యాంకులు ప్రాంగణంలో శాఖలను ఏర్పాటు చేశాయి. ఈ బ్యాంకులు రూ. 37 కోట్ల విలువైన లావాదేవీలను నిర్వహించాయి. వీటిలో ఎక్కువ డిపాజిట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో నమోదయ్యాయి. గణనీయమైన సంఖ్యలో భక్తులు నగదు జమ చేశారని, ఉపసంహరణలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. మైదానంలో 50 మొబైల్ ATMలతో సహా 55 ATM బూత్‌లు ఏర్పాటు చేశారు. అయితే డిజిటల్ లావాదేవీలు పెరగడంతో ATMలకు డిమాండ్ తక్కువగా ఉంది. కొన్ని ATMలకు వారం తర్వాత మాత్రమే రీఫిల్ చేయాల్సి వచ్చింది. డిజిటల్ చెల్లింపుల వైపే మక్కువ చూపించారు.

ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. భారతీయ సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వంపై అంతర్జాతీయంగా ఆసక్తిని కనుబరిచారు. భూటాన్ రాజు, వివిధ దేశాల మంత్రులు మరియు ప్రముఖులతో కలిసి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. నేపాల్ నుంచి 50 లక్షలకు పైగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించగా… 27 ఇతర దేశాల నుంచి రెండు లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య సందర్శించారు.

అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, అనేక మంది కేంద్ర మంత్రులు సహా భారతదేశ అగ్ర నాయకత్వం పాల్గొంది. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు.

తాజాగా దీన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘‘మహా కుంభమేళా పూర్తయింది. ఐక్యత మహా యజ్ఞం పూర్తయింది. 45 రోజుల పాటూ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభ మేళాలో 140 కోట్ల దేశ ప్రజల విశ్వాసం అద్భుతమైంది.’’ అంటూ కొనియాడుతూ మోడీ రాసుకొచ్చారు.