Site icon NTV Telugu

Stray Dogs Attack: ఆరేళ్ల చిన్నారిపై వీధికుక్కల గుంపు దాడి.. బాలుడు మృతి

Stray Dogs

Stray Dogs

వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. ఉత్తరప్రదేశ్‌లో ఆరేళ్ల చిన్నారిపై ఓ కుక్కల గుంపు మూకుమ్మడిగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద నెలకొంది. రాష్ట్రంలో బరేలీలోని షేర్‌ఘర్ పట్టణంలోని 5వ వార్డులో చేదలాల్ తన భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. వారికి 6 ఏళ్ల కుమారుడు దక్షు ఉన్నాడు. బుధవారం బాలుడు పిల్లలతో కలిసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపంలోని పొలంలో ఆడుకోవడానికి వెళ్లాడు. అక్కడ ఆడుకుంటుండగా చిన్నారులపైకి వీధికుక్కల గుంపు ఎగబడింది. దీంతో పిల్లలంతా భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో దక్షు పరుగెడుతూ కింద పడిపోవడంతో కుక్కల గుంపు అతడిపై దాడికి తెగబడ్డాయి.

Also Read: Deepika Padukone: దీపికా కూడా నెపోటిజం బాధితురాలేనా!.. హాట్‌టాపిక్‌గా హీరోయిన్‌ కామెంట్స్‌

దీంతో ఆ బాలుడికి బలమైన గాయాలు అయ్యాయి. అతడి స్నేహితులు దక్షు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి వెళ్లిన వారికి దక్షు రక్తం మడుగులో కనిపించాడు. హుటహుటిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు. దక్షు మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నివాస ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కుక్కల దాడి ఘటనలు చాలా జరిగాయని, అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. వెంటనే తమ గ్రామంలో కుక్కల బెడదను నివారించాలంటూ వారు ప్రభుత్వాన్ని వారు డిమాండ్‌ చేశారు.

Also Read: Snake Robot: నాసా కోసం స్నేక్ రోబోట్.. ఇండియన్ సైంటిస్ట్ ఘటన..

Exit mobile version