6 Of Family Killed As Fire Breaks Out At Furniture Shop In UP: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫర్నీచర్ షాప్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎలక్ట్రానిక్స్ కమ్ ఫర్నీచర్ షాప్ ఉండగా, ఫస్ట్ ఫ్లోర్‌లో కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా.. ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని అధికారులు తమ ప్రాథమిక విచారణలో తేల్చారు.
ఈ సంఘటన గురించి తమకు సమాచారం అందగానే.. ఆగ్రా, మెయిన్‌పురి, ఈటా, ఫిరోజాబాద్ నుంచి 18 ఫైర్ బ్రిగేడ్ వాహనాల్ని రప్పించారమని సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ ఆశిష్ తివారీ తెలిపారు. అలాగే.. 12 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారని చెప్పారు. రెండున్నర గంటల పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందని.. తీవ్రంగా శ్రమించి శిథిలాల్లో చిక్కుకున్న వారిని, మృతదేహాలను వెలికితీశామని పేర్కొన్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు ఈ ప్రమాదంలో మృతి చెందారని, వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం వ్యక్తం చేసిన ఆయన.. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల పరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.