Poonch Terror Attack: గత వారం జమ్మూ కాశ్మీర్ పూంచ్ లో సైనికులు వాహనంపై ఉగ్రవాదులు దాడి చేసి ఐదుగురు రాష్ట్రీయ రైఫిల్స్ జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. గ్రేనేడ్లను విసిరి, విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. ఈ ఉగ్రదాడికి సంబంధించిన కుట్ర బయటపడుతోంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన పేలుడు పదార్థాలతో టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. వీరికి ఆశ్రయం కల్పించిన ఆరుగురిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రకటించారు. ఏప్రిల్ 20న జరిగిన దాడిలో ముగ్గురి నుంచి ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపారు.
Read Also: Noida: దీని కోసం “ప్రాంక్” చేస్తారా..? పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించిన ఇన్‌స్టా పోస్ట్..
ఈ దాడికి సంబంధించి ఇప్పటి వరకు 200 మందిని విచారించామని, దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను మట్టుపెట్టే ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ప్రస్తుత అరెస్టైన ఆరుగురు ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆహారం అందించడమే కాకుండా పేలుడు పదార్థాలు అందించడం, దాడి జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లడం చేశారని పోలీసులు వెల్లడించారు. నిసార్ అనే స్థానికుడు ఉగ్రవాదులకు ఆశ్రయం, ఆహారం, అన్ని సదుపాయాలు అందించారని, పేలుడు పదార్థాలు పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా వచ్చాయని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు అటవీ ప్రాంతానికి దగ్గర ఉన్న ప్రదేశాలను ఎంచుకుంటారని, వారికి స్థానికంగా మద్దతు లభిస్తోందని, అడవుల్లో తప్పించుకునేందుకు వీలవుతుందని దిల్ బాగ్ సింగ్ అన్నారు. నిసార్ కు లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.