Subramaniaswamy deepam row: తమిళనాడు తిరుప్పరంకుండ్రం సుబ్రమణ్యస్వామి దేవాలయ దీపం వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల, మద్రాస్ హైకోర్టు జడ్జి జీఆర్ స్వామినాథన్ సంచలన తీర్పు ఇచ్చారు. కొండపై ఉన్న ఆలయం వద్ద దీపం వెలిగించాలని ఆదేశించారు. డీఎంకే ప్రభుత్వ వాదనల్ని పట్టించుకోలేదు. 100 ఏళ్లకు పైగా సంప్రదాయంగా వస్తున్న కొండ దిగువన ఉన్న స్తంభానికి బదులుగా, కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశించారు. కొండపైన ఉన్న స్తంభం కూడా ఆలయ ఆస్తి అని స్పష్టం చేశారు.
అయితే, ఇది ఇప్పుడు వివాదాస్పదమైంది. న్యాయమూర్తిని తొలగించాలంటూ ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే పార్టీలకు సంబంధించిన 100 మందికిపైగా ఎంపీలు మద్దతు తెలుపుతూ రెండు రోజుల క్రితం స్పీకర్ ఓంబిర్లాకు ‘‘అభిశంసన’’ తీర్మానాన్ని ఇచ్చారు. ఈ తీర్మానం ఇచ్చిన బృందంలో అఖిలేష్ యాదవ్, ప్రియాంకాగాంధీ, కనిమొళిలు ఉన్నారు. ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో ఈ తీర్పు మత ఉద్రిక్తతల్ని పెంచుతుందని డీఎంకే వాదిస్తోంది. మధురైకి సమీపంలో ఉన్న కొండపై 6వ శతాబ్ధానికి చెందిన సుబ్రమణ్య స్వామి ఆలయం ఉంది. అదే కొండపై 14వ శతాబ్ధానికి చెందిన ఒక దర్గా ఉంది. దీంతో వివాదం రాజుకుంది.
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై జడ్జి జీఎస్ స్వామినాథన్‌కు మద్దతుగా మాజీ న్యాయమూర్తులు రంగంలోకి దిగారు. ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 56 మంది న్యాయమూర్తులు అభిశంసన తీర్మానాన్ని తప్పుపట్టారు. తమ రాజకీయ సిద్ధాంతాలకు రుచించని తీర్పు చెప్పిన న్యాయమూర్తిని భయపెట్టే పనిగా అభివర్ణించారు. ఇది న్యాయమూర్తులను భయపెట్టే ప్రయత్నమని అన్నారు. ఇలాంటి వైఖరి దేశ న్యాయ స్వతంత్రను తీవ్రంగా దెబ్బతీస్తుందని వారు తన ప్రకటనలో పేర్కొన్నారు. 1975 లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సంఘటనలను ఉదహరిస్తూ.. ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఒత్తిడికి గురి చేసే పాత పద్ధతి అని అన్నారు.
మరోవైపు, ఈ అభిశంసన ప్రయత్నాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది. కేంద్ర హోం మంత్రి దీనిపై మాట్లాడుతూ.. ఇది ప్రతిపక్షాల బుజ్జగింపు రాజకీయాలు అని ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి ననుంచి ఒక న్యాయమూర్తి తీర్పు కోసం అభిశంసన ఎదుర్కోవడం ఎప్పుడూ జరగలేదు. వారు తమ ఓటు బ్యాంకును సంతృప్తి పరిచేందుకు దీనిని తీసుకువచ్చారని అన్నారు. మరోవైపు, తమిళనాడు ఎంపీ, డీఎంకే చీఫ్ స్టాలిన్ మాట్లాడుతూ.. బీజేపీ మతపరమైన అంశాలను రాజకీయం చేస్తోందని ఆయన అన్నారు.